మన్సూరాబాద్, మే 19 : డ్రైవర్ దృష్టి మరల్చి కారులోని బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఓ సభ్యున్ని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి 30.1 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన కల్లికూడి పంచాయతీ గ్యాంగ్ మెంబర్స్లోని ( రాంజీ లేదా తిరుచ్చి గ్యాంగ్ పేర్లతో వీరిని పిలుస్తుంటారు) ముఠా సభ్యులైన అంతర్రాష్ట్ర దొంగలు జగన్, కిరణ్, యత్వాన్, అప్పు అలియాస్ మోహన్‌రాజ్, వెంకటేషన్ తరచూ హైదరాబాద్ నగరానికి రైలులో వచ్చి దొంగతనాలకు పాల్పడుతుంటారు. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్లపై పార్కింగ్ చేసి షాపుల్లోకి వెళ్లే వారిపై దృష్టి పెడుతారు. కారు పార్కింగ్ చేసి అందులోని వ్యక్తులు షాపింగ్ కోసం దుకాణాల్లోకి వెళ్లగానే డ్రైవర్ వద్దకు వస్తారు. డ్రైవర్ ముందు కొన్ని నోట్లను విసిరి మీ డబ్బులు కింద పడ్డాయంటూ చెబుతారు. డ్రైవర్ కిందకు వంగి డబ్బులు తీసుకుంటుండగా మరో వ్యక్తి వెనుక డోర్ వద్ద నుంచి కారులోని ఆభరణాలు, నగదును అపహరిస్తారు.
మార్చి 4న కారులో నగలు చోరీ
ఉప్పల్, ఫీర్జాదిగూడకు చెందిన డాక్టర్ వడ్డేపల్లి స్పందన మార్చి 4న షాపింగ్ కోసం చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేటలోని ఫస్ట్ క్రై షాపునకు తన సోదరితో కలిసి వచ్చింది. బంధువుల ఇంట్లో వివాహం ఉండటంతో బంగారు ఆభరణాలను కారులోనే ఉంచి షాపులోకి వెళ్లారు. వెనుక సీటులో ఉన్న బ్యాగులను గమనించిన తమిళనాడుకు చెందిన ముఠా సభ్యులైన జగన్, కిరణ్, యత్వాన్, అప్పు అలియాస్ మోహన్‌రాజ్, వెంకటేషన్ కారు వద్దకు వచ్చారు. కొందరు డ్రైవర్ ముందు నోట్లు విసిరి డబ్బులు కింద పడ్డాయని చెప్పగా.. అతడు తీసుకుంటుండగా వెనుక డోర్ నుంచి 49.5 తులాల బంగారు ఆభరణాలకు చెందిన బ్యాగులను అపహరించుకుని పారిపోయారు. బాధితురాలు స్పందన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో ప్రమేయం ఉన్న తమిళనాడు, కడలూరు జిల్లా, తిరకతేరు, భారతినగర్, ఎల్ఎన్ పురంకు చెందిన వెంకటేషన్ (36)ను పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి 30.1 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జగన్, కిరణ్, యత్వాన్, మోహన్‌రాజ్ పరారీలో ఉన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి సీఐ మధుసూదన్, ఎస్సై ముదస్సర్ పాల్గొన్నారు.