సిటీబ్యూరో/బంజారాహిల్స్/కంటోన్మెంట్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): పేదరికాన్ని చూస్తే ప్రతి ఒక్కరికీ జాలి కలుగుతుంది. ఆకలితో ఉన్న అభాగ్యులను చూస్తే గుండె కరిగిపోతుంది. అనారోగ్యంతో ఉన్నవారిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంటుంది.రోడ్డుమీద వెళ్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కనిపించినా మనసు చలించి తోచినంత సాయం చేస్తుంటాం. ప్రజల్లో దాగి ఉండే ఈ ఎమోషన్స్‌నే కొందరు వ్యాపారంగా మలుచుకున్నారు. కొందరు బెగ్గర్స్ అవతారమెత్తగా, మరికొందరు ట్రాన్స్జెండర్ల వేషదారణతో ప్రజలను వేధింపులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలను నడిపిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నగరంలోని ప్రధాన కూడళ్లలో బిక్షాటన పేరుతో వాహనదారులను, పాదచారులను, దుకాణదారులను వేధింపులకు గురిచేస్తున్న యాచక ముఠాలపై టాస్క్‌ఫోర్స్, వెస్ట్, నార్త్‌జోన్ పోలీసులు కొరఢా ఝలిపించారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల పేరుతో నగరానికి రప్పించి వారితో బిక్షాటన చేయిస్తూ రోజు వారీగా సంపాదిస్తున్న ముఠాతో పాటు ట్రాన్స్‌జెండర్ వేషాధారణలో బలవంతంగా బిక్షాటన చేయిస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఘటనల వివరాలను శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవీస్, నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తిలు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ నర్సింహారావుతో కలిసి వేరు వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గుల్బర్గా నుంచి తీసుకువచ్చి..
కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్ పవార్ (28) గత కొంతకాలంగా తమ ప్రాంతానికి చెందిన కొంతమంది బంధువులతో పాటు వారి స్నేహితులను పని ఇప్పిస్తానంటూ నగరానికి తీసుకు వస్తున్నాడు. వారిని ఫతేనగర్, బాలానగర్, తాడ్బన్ ప్రాంతాల్లోని సిగ్నల్స్ వద్ద వదిలేసి బిక్షాటన చేయిస్తున్నాడు. గత కొంతకాలంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో యాచకుల సమస్య తీవ్రంగా మారడంతో వాహనదారులు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెండ్రోజుల కిందట కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గుల్బర్గా ప్రాంతానికి చెందిన 23మంది యాచకులను అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
20 కుటుంబాలు..70మంది యాచకులు
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న యాచకులను విచారించడంతో బెగ్గింగ్ ముఠాను నడిపిస్తున్న అనిల్ పవార్‌తో పాటు రాము, రఘు, ధర్మేందర్ తదితరులు వారిని నగరానికి తీసుకువచ్చి బిక్షాటన చేయిస్తున్నారని తేలింది. గత ఆరునెలల్లో 20 కుటుంబాలకు చెందిన 70మందిని నగరానికి తీసుకువచ్చిన అనిల్ పవార్ గ్యాంగ్ వారిని వివిధ ప్రాంతాల్లో బిక్షాటన చేయిస్తున్నారు.
చిన్నపిల్లలకు కల్లు తాగిస్తూ..
ప్రతి సోమవారం వారంతా ప్యారడైజ్ చౌరస్తావద్ద సమావేశమై అక్కడినుంచి వారంరోజుల పాటు ఎక్కడెక్కడ బిక్షాటన చేయాల్సి ఉంటుందో అనిల్ పవార్ సూచనల మేరకు గ్రూపులుగా విడిపోతుంటారు. వారిని వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు సుమారు 10నుంచి 15 ద్విచక్ర వాహనాలను పవార్ గ్యాంగ్ వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా చిన్నపిల్లలలను, వికలాంగులను చౌరస్తాల వద్దకు తీసుకువెళ్లి వారిని చూపిస్తూ ముఠాసభ్యులు బిక్షాటన చేయిస్తుంటారని, ముఖ్యంగా చిన్నపిల్లలకు కల్లు తాగిస్తూ వారు అపస్మారక స్థితిలోకి జారుకునేలా చేసి పిల్లలు అనారోగ్యంతో ఉన్నారంటూ బిక్షాటన చేయిస్తున్నారని తేలింది.
ఎదురుతిరిగితే దాడులు
ముఠాలోని సభ్యులందరికీ విపరీతంగా మద్యపానం అలవాటు చేయించిన అనిల్ పవార్ వారికి రోజుకు రూ.200 ఇచ్చి మిగిలిన డబ్బును మొత్తం వసూలు చేసుకుంటున్నాడని తేలింది. ఎదురుతిరిగితే సొంతూరికి పంపించేస్తామని, మద్యం తాగేందుకు డబ్బులు కూడా దొరకవంటూ బెదిరిస్తుంటారు. బిక్షాటన ద్వారా ఒక్కో వ్యక్తికి రోజుకు సగటున రూ.5వేల నుంచి 7వేల దాకా వస్తుంటే వారివద్దనుంచి నేరుగా అనిల్ పవార్ ప్రతిరోజూ తీసేసుకుంటాడని, కేవలం మద్యం తాగేందుకు మాత్రమే డబ్బులు మిగుల్చుతున్నాడని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే చితకబాదడంతో పాటు గ్రూపులోని ఇతర సభ్యులతో దాడులు చేయిస్తుంటాడని తేలింది.
నకిలీ ట్రాన్స్జెండర్లతో…
బీహార్‌కు చెందిన రాజేశ్‌యాదవ్, అనిత ట్రాన్స్జెండర్లు. వీరిద్దరూ మల్కాజిగిరి ప్రాంతంలో నివాసముంటున్నారు. బీహార్, ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన 17 మంది యువకులు వీళ్ల వద్ద చేరారు. ట్రాన్స్జెండర్ల వేషలో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని పథకం వేశారు. ట్రాఫిక్ జంక్షన్లు, దుకాణాల వద్ద నుంచి ఎలా డబ్బు వసూలు చేయాలనే దానిపై రాజుయాదవ్ ఈ ముఠాకు శిక్షణ ఇచ్చాడు. వీళ్లందరిని రోడ్లపైకి వదలడంతో పారడైజ్ ఎక్స్ రోడ్స్, స్వీకార్ ఉపకార్ జంక్షన్, జూబ్లీ బస్‌స్టాండ్, సంగీత్ క్రాస్ రోడ్స్, సుచిత్రా ఎక్స్ రోడ్డు, తదితర జంక్షన్లతో పాటు స్థానికంగా ఉండే దుకాణాలు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారితో పాటు రద్దీ ప్రాంతాలలో బలవంతంగా వసూళ్లు చేస్తుంటారు. బిక్షాటన మాటున సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసు, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మారేడ్‌పల్లి, గోపాలపురం పోలీసులు సంయుక్తంగా బిక్షాటన పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అరస్టైన వారిలో రాజుయాదవ్, అనితతో పాటు నేత్ర, వంక్డోత్ రమేశ్, బుదావత్ నితిన్, సనా ఖాన్, బోదల సుధీర్, వినుకండ ఇమాన్యుల్, ప్రమోద్ కాంబ్లీ, గణేశ్, భూక్య అఖిల్, పేరమ్, పెద్దపల్లి నిరంజన్, సంజయ్, లకావత్ ప్రశాంత్, మంజి ప్రవీణ్‌కుమార్, కృష్ణ, చోటు కుమార్, మంజయ్ కుమార్ ఉన్నారు. వారి వద్ద నుంచి కొంత నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బలవంతంగా వసూలు చేసిన డబ్బుతో ఇంకా ఏమైన చీకటి దందాలు చేస్తున్నారా.. అనేకోణంలో ఆరా తీస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
బెగ్గింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు
ప్రధాన నిందితుడు అనిల్పవార్ మీద ఐపీసీ 336, సెక్షన్ 76, 77 ఆప్ జువైనల్ జస్టిస్ యాక్ట్, బెగ్గింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యాచకులను తరలించేందుకు వినియోగిస్తున్న 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ఇతర సభ్యులు పరారీలో ఉన్నారని. వారికోసం గాలిస్తున్నామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. రోడ్లమీద బెగ్గర్స్ కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ ఏవీఆర్.నర్సింహారావు, జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.