అబిడ్స్, డిసెంబర్ 27: సైన్స్ అండ్ టెక్నాలజీని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందని, సాంకేతికతలో కృత్రిమ మేధ ప్రాముఖ్యత కలిగి ఉందని వియత్నాం దేశానికి చెందిన హనోయ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ న్యూయెన్ హంసంగ్ అన్నారు. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో తొమ్మిదవ అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రీసెర్చ్ ఇంటల్లీజెంట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (రైస్-2024)పై మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైద్రాబాద్, యూనివర్సిటీ ఆఫ్ డాన్‌బాస్కో ఎల్ సాల్విడార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు విదేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సు ప్రారంభానికి ముందుగా హాజరైన అతిథులు, కళాశాల కరెస్పాండెంట్ కె.కృష్ణారావు, దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంతర్జాతీయ సదస్సు (రైస్-2024)కు కన్వీనర్‌గా అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఎం.స్వప్న అధ్యక్షత వహించగా, వియత్నాం దేశానికి చెందిన హనోయ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ న్యూయెన్ హంసంగ్ గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం వల్ల అభివృద్ధి అవుతుందన్నారు.
కంప్యూటర్ రంగంలో నేడు కృత్రిమ మేధ అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల వీలు కాని సమస్యలను కూడా అతి సులభంగా పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. సాంకేతికత అనేది అన్ని రంగాల అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని చెప్పారు. కృత్రిమ మేధ నేడు సాఫ్ట్వేర్ రంగమే కాకుండా పారిశ్రామిక, వైద్య రంగాలలో అద్భుతంగా ఫలితాలను ఇస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మలేషియా దేశానికి చెందిన లింకల్న్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, గణన శాస్ర్తానికి సంబంధించిన పరిధోధనలు ఇంజనీరింగ్ పరిజ్ఞానం పెరగడానికి ఎంతో సహకరిస్తాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ వలన నేడు సమాచార భద్రత అనేది రూఢీ చేయబడిందని పేర్కొన్నారు.
సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం మొదలగు ముఖ్యమైన పనులను కృత్రిమ మేధతో ఎంతో సులభంగా చేయగలమని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మరొక వక్తగా సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ అతుల్ నాగి కార్యక్రమ ముఖ్య ఉద్ధేశం గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా స్టాన్లీ కళాశాల కరస్పాండెంట్ కె.క్రిష్ణారావు అతిథులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో బిషప్ డాక్టర్ ఎం.ఏ.డేనియల్, సెక్రెటరీ, కరస్పాండెంట్ కె.క్రిష్ణారావు, మేనేజ్మెంట్ సభ్యులు టి.రాకేశ్ రెడ్డి, ఆర్.ప్రదీప్ రెడ్డి, లంక ప్రిన్సిపాల్ డాక్టర్ సత్య ప్రసాద్, డీన్ అకాడమిక్స్ డాక్టర్. ఏ.వినయ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ వి.అనూరాధ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ.రమేశ్, ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ విజయేందర్ కుమార్ సోలంకి, కన్వీనింగ్ టీమ్ డాక్టర్ ఎం.స్వప్న, డాక్టర్ శివాని యాదవ్, డాక్టర్, జి.కార్తీక్‌లతో పాటు వందలాది మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.