కాచిగూడ,జనవరి 7: కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంటకు(Love couple) మంగళవారం రాత్రి మతాంతర వివాహం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..అంబర్‌పేటలోని ఖాద్రిబాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్(27),వృత్తిరీత్యా ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.గోల్నాకలోని సంజీవయ్యనగర్ ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ(24),వీరిద్దరు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఐతే వీరిద్దరి వివాహన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేక పోవడంతో సయ్యద్ ఇమ్రాన్, భవ్యశ్రీ ఇంట్లోంచి పారిపోయి 2 నెలల క్రితం చర్చిలో పెండ్లి చేసుకున్నారు. పెండ్లి విషయం తెలుసుకున్న భవ్యశ్రీ తల్లి మంగళవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా కాచిగూడ ఏసీపీ హరీశ్‌కుమార్ వారిద్దరిని పిలిపించారు.
వారిద్దరు పెండ్లి చేసుకున్న వివాహ సర్టిఫికేట్‌ను చూపించారు. మేమిద్దరం మేజర్లమని, ఇద్దరం ఇష్టపడే పెండ్లి చేసుకున్నామని ఇమ్రాన్, భవ్యశ్రీ చెప్పారు. ఇరువురి తల్లిదండ్రులను పీఎస్‌కు పిలిపించి, ఒప్పించి కాచిగూడ ఏసీపీ, కాచిగూడ ఇన్స్పెక్టర్ సమక్షంలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లోనే సయ్యద్ ఇమ్రాన్ భవ్యశ్రీ మెడలో తాళి కట్టించి, పూలదండలు మార్పించారు. పోలీస్‌స్టేషన్‌లోనే పోలీసులు వీరిద్దరికి తాళి కట్టించి మతాంతర వివాహం జరిపించడం గమనార్హం.