మేడ్చల్, మార్చి 9(నమస్తే తెలంగాణ) : స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళా సంఘాలు సబ్‌స్టేషన్ వద్ద సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వానికి కరెంట్ అమ్మేలా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. విజయ డెయిరీకి పాలమ్మిన వారికి రూ.4 బోనస్‌ను అందజేస్తామన్నారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.306.12 కోట్ల రుణాల చెక్కును సీఎం మహిళా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.