దుండిగల్, జనవరి 21: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పలు మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని మెడికల్ షాపులపై మేడ్చల్ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హేమలత తదితరులు పలు మందుల దుకాణాలపై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. మల్లంపేట్లోని కొన్ని మెడికల్ షాపులకు జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయం నుంచి షాపు నిర్వహణకు తీసుకున్న అనుమతుల గడువు ముగిసినప్పటికీ వాటిని రెన్యువల్ చేయించుకోకుండానే దుకాణాలు నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఔషధ నీయంత్రణ శాఖ అధికారుల తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.
వాస్తవానికి ప్రతి ఐదేండ్లకు ఒకసారి మందుల షాపుల నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మల్లంపేట్తోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు పీఎంపీ, ఆర్ఎంపీ వైద్యులు సైతం ఎటువంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా మందులను విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో కొన్ని ‘షెడ్యూల్డ్ హెచ్’డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి హేమలతను వివరణ కోరగా.. సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించడం గమనార్హం. అయితే మల్లంపేట్లోని కొన్ని మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆమె అంగీకరించారు.