సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ టాస్క్ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ మేరకు గచ్చిబౌలిలో ఫ్లెఛజో వంటగది అపరిశుభ్రంగా ఉందని, డస్ట్బిన్లపై సరైన మూతలు లేకుండా తెరిచి ఉన్నట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్లకు లేబుల్స్ సరిగా లేవని, ప్యాకేజ్డ్ చికెన్ రోజుల తరబడి నిల్వ ఉన్నట్లు గుర్తించారు. గచ్చిబౌలిలోని ది గ్లోబ్ గుర్భ్లో ఆర్వో వాటర్ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తేల్చారు. గచ్చిబౌలిలోని హోయ్ పంజాబ్లో నిల్వ చేసిన వెజ్ బిర్యానీ చూసి అధికారులు ఖంగుతిన్నారు. వంటలో వినియోగించే నూనె జిడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వాటర్ బాటిళ్లలో వాటర్ ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు.