సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.’ మన దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో కూడిన బోధన అందాలనేదే విద్యావేత్తల ఆకాంక్ష. ఈ లక్ష్యంతోనే అధికారులు పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధించొచ్చు. కానీ, హైదరాబాద్ విద్యా వ్యవస్థలో ఈ దిశగా అడుగులు పడటం లేదు. డీఎస్సీ-2024 టీచర్ల భర్తీలో అవకతవకలు జరగడమే ఇందుకు ఉదాహరణ. అవసరమున్న చోట టీచర్లను కేటాయించకుండా.. అవసరం లేని చోట టీచర్లను కేటాయించడం ఏంటి? అని ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజులుగా కథనాలు ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ ఒక కమిటీ ఏర్పాటు చేసి టీచర్ల భర్తీపై వివరాలు సేకరించాలని ఆదేశాలిచ్చారు.
అయితే, అందులో చాలా మంది డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్‌లు ఉండటంతో గురువారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(ఎస్ఈఎం)తో విచారణ జరిపించేందుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సదరు ఎస్ఈఎం ఆధ్వర్యంలో ఎనిమిది మంది విద్యాశాఖాధికారుల వివరణను రికార్డు చేశారు. ఖాళీలు ఎందుకు చూపించలేదు? అవసరం లేని పాఠశాలలకు టీచర్లను ఎందుకు కేటాయించారు? ఎవ్వరైనా చెప్పారా? డీఈఓ ఆదేశాలు ఉన్నాయా? ఖాళీలు ఎక్కడెకక్కడ ఉన్నాయి? ముందే ఎందుకు ఆ మేరకు కసరత్తు చేయలేదు? తదితర ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. కాగా, టీచర్ల భర్తీలో డీప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్‌లను పర్యవేక్షించాల్సిన డీఈఓ రోహిణీ వివరణను కూడా ఎస్ఈఎం రికార్డు చేసినట్టు సమాచారం.
అంత నిర్లక్ష్యం ఎందుకు?
హైదరాబాద్‌లో డీఎస్సీ 2024లో 584 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారు. 878 పోస్టులకు గాను కోర్టు కేసులు, రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థుల కొరత, ఇన్ సర్వీస్ తదితర కారణాలతో 262 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 616 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ధ్రువీకరణ పత్రాల రీ వెరిఫికేషన్‌తో 32 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. నియామక పత్రాలు అందుకున్న వారిలో 386 ఎస్జీటీ, 107 ఎస్ఏ, 91 ఎల్పీ అభ్యర్థులకు పోస్టింగులు లభించాయి. వీరిని అవసరమున్న చోట భర్తీ చేయకుండా ఇష్టానుసారంగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు ఈ తతంగానికి బాధ్యులెవ్వరు? అని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించడంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. రెండు రోజుల్లో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఉండనున్నాయి.