రామచంద్రాపురం, జూన్ 25: సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లోని శిల్పా డ్రీమ్ వ్యాలీ వెంచర్పైన పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సైబరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పటాన్చెరు సర్కిల్ డీసీ జ్యోతిరెడ్డిని ఆదేశించారు. గురువారం నమస్తేతెలంగాణలో ప్రచురితమైన ‘శిల్పా వెంచర్లో ఓపెన్ దందా’ శీర్షికకు సీఎంసీ కమిషనర్ సృజన స్పందించారు. వార్తా కథనాన్ని ట్యాగ్ చేసి సమగ్ర విచారణ చేసి యాక్షన్ రిపోర్ట్‌ని అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు పటాన్చెరు సర్కిల్ ఇన్చార్జి ఏసీపీ ప్రసీద కొల్లూర్ శిల్పా డ్రీమ్ వ్యాలీ వెంచర్‌కు సంబంధించిన లేఅవుట్‌ని పరిశీలిస్తున్నారు. అందులోని ఓపెన్ స్పేస్‌లతో పాటు పార్కు స్థలాలపైన ఆరా తీస్తున్నామని ప్రసీద తెలిపారు. రెండు రోజుల్లో లేఅవుట్‌ని పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణకు సంబంధించిన నివేదికను సీఎంసీ కమిషనర్‌కు పంపిస్తామని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.