హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బాలానగర్‌లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) భూముల కబ్జా ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్వే నంబరు 376లో ఉన్న ఐడీపీఎల్ భూములు అన్యాక్రాంతమవుతున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల ఐడీపీఎల్ భూముల కబ్జాలపై పరస్పర ఆరోపణలకు దిగిన నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐడీపీఎల్.. గతంలో దేశీయ ఔషధ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ప్రైవేటు సంస్థల రాకతో ప్రాభవం కోల్పోయి మూతపడింది. ఐడీపీఎల్ సంస్థ ఉన్న బాలానగర్ ప్రాంతం గతంలో హైదరాబాద్ శివారులో ఉండేది. కాలక్రమంలో నగరం విస్తరణతో దాని చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పడి.. ఐడీపీఎల్ భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దశాబ్దాల క్రితం ఐడీపీఎల్ ఏర్పాటు కోసం సుమారు 891ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం కంపెనీ మూతపడడంతో ఈ భూములపై కబ్జాదారుల కన్నుపడింది.
వీటి విలువ సుమారు రూ.20 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా పీఎస్‌యూలను తెగనమ్మే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐడీపీఎల్ భూములను కూడా అమ్మేందుకు చర్యలు చేపట్టినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కాగా, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఆ భూములను తిరిగి రాష్ర్టానికి అప్పగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. గతంలో పారిశ్రామికీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించించిందని, ఇప్పుడు ఐడీపీఎల్ మూతపడినందున ఆ భూములను తమకు స్వాధీనం చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.
కానీ కేంద్రం దీనిపై స్పందించలేదు. తాజాగా భూములు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపణలు రావడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దశాబ్దాల క్రితం తెలంగాణలోని సుమారు 12,253 ఎకరాల భూములను 11 ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించారు. అందులో ప్రస్తుతం 3,600 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉండగా, పీఎస్‌యూలు మూతపడటంతో మిగిలిన భూములు నిరుపయోగంగా ఉన్నా యి. ఐడీపీఎల్‌కు 891 ఎకరాలు, సిమెంట్ కార్పొరేన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి 2,290 ఎకరాలు, హిందుస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్ఎంటీ)కి 123 ఎకరాలు కేటాయించారు.
కాగా, ఇందులో ఐడీపీఎల్ భూముల్లో 543 ఎకరాలు, సీసీఐకి చెందిన 773ఎకరాలు, హెచ్‌ఎంటీకి చెందిన 50 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. అలాగే, బీహెచ్ఈఎల్కు 2,350ఎకరాలు కేటాయించగా, అందులో 225 ఎకరాలు, కుషాయిగూడలోని ఈసీఐఎల్‌కు 1,200 ఎకరాలు కేటాయించగా, అందులో 270 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్టలో రక్షణ శాఖకు చెందిన మిధానీ, బీడీఎల్, డీఆర్డీవో, డీఆర్డీఎల్ ఏర్పాటుకోసం కేటాయించిన భూముల్లో సైతం చాలావరకు నిరుపయోగంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
స్వాగతిస్తున్నా: ఎమ్మెల్యే మాధవరం
కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 16 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఐడీపీఎల్ భూములు అన్యాక్రాంతం కావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరిపించాలని కోరతూ… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే కృష్ణారావు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ఐడీపీఎల్ భూములపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించడం సంతోషకరమన్నారు. ఐడీపీఎల్ భూములపై సమగ్ర విచారణ జరిపి, కజ్జాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.