సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): యువతను చిత్తు చేసి వారి ప్రాణాలను హరించి వేసే సరికొత్త మత్తు ట్రెండ్ నగరంలోకి ప్రవేశించింది. గంజాయి, డ్రగ్స్ ల విచ్చలవిడి అక్రమ సరఫరాతో సతమవుతున్న భాగ్యనగరాన్ని.. ఎవరూ ఊహించని ఓ భయంకరమైన మత్తు పదార్థం తీవ్రంగా కలవరపెడుతున్నది. పెయిన్ కిల్లర్లను కొనుగోలు చేసి వాటికి గ్లూకోజ్ కలిపి ఇంజక్షన్లుగా మార్చి యువతను ప్రాణాపాయంలోకి నెట్టివేస్తున్న విష సంస్కృతి నగరాన్ని ఆవహించింది. ఓ వైపు నిబంధనలకు విరుద్ధంగా ఫార్మసీ దుకాణాల్లో సాగుతున్న విక్రయాలు ఇందుకు ఓ కారణమైతే ఇంత జరుగుతున్నా కనీస నిఘా కొరవడిన ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం అన్నింటికన్నా మరో ప్రధాన కారణమైంది.
పోలీసులు, ఎక్సైజ్, తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేష్రన్ ఇలా ఆయా విభాగాల కండ్లు గప్పి యథేచ్చగా శివారులలో అక్రమ మందుల దందాను సాగిస్తున్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్‌పై నిఘా పెరగడంతో మెడికల్ దుకాణాలలో దొరికే మందులనే కొందరు యువకులు మత్తుగా వాడేస్తున్నారు. దీనిని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ విష సంస్కృతి కారణంగా బాలాపూర్‌లో 17 ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు యువకులు దవాఖానలో విషమ పరిస్థితుల్లో ఉన్నారు. బాలాపూర్‌లో శ్రీనివాస ఫార్మసీ దుకాణం నుంచి షాహిల్ అనే యువకుడు పెద్ద ఎత్తున పెయిన్ కిల్లర్లను కొనుగోలు చేసి స్థానికంగా ఉండే యువకులు, మైనర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
మత్తు పదార్ధాలు, పెయిన్ కిల్లర్లు, నిద్ర మాత్రలను వైద్యుల ప్రిస్కిప్ష్రన్ లేకుండా ఫార్మసీ దుకాణాలు విక్రయించేందుకు వీలు లేదు. కాని కొన్ని సందర్భాలలో తెలిసిన వారు వస్తే ఒకటి రెండు మాత్రలకు మించి ఇవ్వడం లేదు. కాని ఏకంగా బల్క్‌లో ఇలాంటి మందులను సరఫరా చేస్తున్నా అటూ డ్రగ్ కంట్రోల్ విభాగం కాని ఇటూ పోలీసుల నిఘా కాని పట్టించుకోకపోవడం గమనార్హం. మెడికల్ దుకాణాలపై మొదట్లో తనిఖీల పేరిట హంగామా చేసిన డ్రగ్ కంట్రోల్ విభాగం ఆ తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. కాగా పెయిన్ కిల్లర్లను అడ్డగోలుగా మార్కెట్లో విక్రయించడంతోనే యువకుల ప్రాణాలపైకి వచ్చిందంటూ స్థానికులు వాపోతున్నారు. టైడాల్ అనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్‌ను బాలాపూర్ ఘటనలో యువకులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ ట్యాబ్లెట్లు వాళ్లకు ఎక్కడ దొరుకుతున్నాయని ఆరా తీయడంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ పిల్లలకు సాహిల్ అనే యువకుడు ఈ మందులను సరఫరా చేస్తున్నాడని, అతనికి మెడికల్ దుకాణంలో నుంచి అమ్మకాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. మూడు నెలలుగా యువకులు ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు, అయితే ఈ ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్ కావడంతో కొన్ని రోజులు వాడితే ఇది ఒక అలవాటుగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే వైద్యులు సూచిస్తేనే ఈ ట్యాబ్లెట్లను ఇవ్వాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఈ టాబ్లెట్‌ను ద్రవంగా మార్చే ఆలోచన చేసిందెవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సాధారణంగా ఈ ట్యాబ్లెట్‌ను వాడడంతో నొప్పులకు ఉపశమనం ఉంటుంది. దాంతో పాటు ఒకటి రెండు టాబ్లెట్లు వాడడంతో కొద్దిగా మత్తుగా ఉంటుంది. అయితే యువకులకు మూడు నెలలుగా ఈ మాత్రను సరఫరా చేస్తుండడంతో రెండు మూడు డోస్‌లు వారికి పనిచేయకపోవడంతోనే డోస్ పెంచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఒకేసారి టాబ్లెట్లు వాడకుండా, సాహిల్ వాటిని గ్లూకోజ్ వాటర్‌లో కలిపి లిక్విడ్‌గా తయారు చేసి, దానిని యువకులకు ఇంజక్ట్ చేశాడని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. గ్లూకోజ్, ట్యాబ్లెట్లు ఎక్కువ మోతాదులో కలువడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువకులతో పాటు ఖాళీగా జులాయిగా తిరిగే వాళ్ల సంఖ్య శివారు ప్రాంతాలలో ఎక్కువగానే ఉంటుంది. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అయితే బాధిత యువకులు ముగ్గురే ఈ అలావాట్లు చేసుకున్నారా మరి సాహిల్ నెట్‌వర్క్‌లో ఇంకెంత మంది ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి సాహిల్ ఇలా టాబ్లెట్లను విక్రయిస్తున్నాడు? అనే విషయాలపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. సాహిల్ నెట్వర్క్ గూర్చి తెలిస్తే ఈ ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మెడికల్ దుకాణాలు, అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కొరఢా ఝళిపించాలని ప్రజలు కోరుతున్నారు.