కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 13: పగలంతా పాత సామగ్రి కొనుగోలు పేరుతో బస్తీల్లో తిరుగుతాడు. తాళం వేసిన ఇళ్లపై గురి పెడుతాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయంలో చోరీకి పాల్పడుతాడు. చోరీ సొత్తును ఓ మహిళ సహాయంతో విక్రయిస్తాడు. వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్నారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితులను ఎట్టకేకలు సీసీఎస్ మేడ్చల్, దుండిగల్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ జోన్ డీసీపీ షబరీశ్ మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పందిరి స్వామి(25) నగరానికి వలసొచ్చి నగర శివారులోని మల్లంపేటలో ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న రహీమా బేగం(44) అతడికి తోడైంది. వీరిద్దరూ కలిసి ఓ స్క్రాబ్ దుకాణాన్ని ఏర్పాటు చేసి, ఒకేచోట ఉంటున్నారు. కాగా, స్వామి ఉదయం సమయంలో పాత సామాన్ల కోసం బస్తీలు తిరుగుతాడు. తాళం వేసి ఉన్న ఇండ్లను గమనిస్తాడు. చోరీ చేసేందుకు పక్కాగా రెక్కీ నిర్వహిస్తాడు.
రాత్రి సమయంలో ఆయా ఇండ్లలోకి చొరబడి విలువైన వస్తువులను దొంగిలిస్తాడు. దొంగిలించిన సొమ్మును రహీమాబేగం తక్కువ ధరకే విక్రయించి.. వచ్చిన సొమ్ముతో ఇద్దరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఓ చోరీ ఘటన పై బాధితుడు గత నెల 19న దుండిగల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దుండిగల్, సీసీఎస్ మేడ్చల్ పోలీసులు ఉమ్మడిగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఫుటేజీ ఆధారంగా లభించిన ఆనవాళ్లతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై గతంలో 24 దొంగతనం కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్, జీడిమెట్ల, దుండిగల్, బాచుపల్లి, సూరారం, ఐడీఏ బొల్లారం పోలీస్స్టేషన్లలో దొంగతనాల కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా నిందితుడు తన తీరు మార్చుకోలేదు. తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విచారణలో రహీమాబేగం పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని విచారించగా నేరాలు అంగీకరించారు. ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి దాదాపు రూ.9.60 లక్షల విలువజేసే బంగారం, వెండి, ద్విచక్రవాహనాలు, వైర్కట్టలు, ల్యాప్టాప్లు, శానిటరీ ట్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన దుండిగల్ , సీసీఎస్ మేడ్చల్ పోలీసులను అభినందించి రివార్డును అందించారు. ఈ సమావేశంలో సీసీఎస్ ఏసీపీ అసివుల్లా, ఇన్స్పెక్టర్ శంకరయ్య, దుండిగల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీసీఎస్ ఎస్ఐ రాంబాబు, సిబ్బంది అమరేందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.