సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే రూ. 33,248.53కోట్లు ఖర్చు చేసి 35 ప్రాజెక్టులు వినియోగంలోకి రాగా..ఈ నెలాఖరులోగా ఇందిరాపార్కు స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సన్నద్ధమవుతున్నది. రూ.350 కోట్లతో ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, వీఎస్టీ మీదుగా అజామాబాద్ వరకు చేపట్టిన బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి.
ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మెట్రో పైనుంచి లింకును కలిపిన అధికారులు స్లాబ్ వర్క్ పనులు చేస్తున్నారు. ఈ నెలాఖరులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి, ప్రారంభానికి ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.