బడంగ్పేట్, జూలై 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మార్చి చివరి వారంలో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ను ఆర్భాటంగా మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా తెలంగాణ) ఆధ్వర్యంలో మున్సిపాల్ నిధులతో ఏర్పాటు చేశారు.
‘పాత గోడకు కొత్త సున్నం’ అన్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్రీట్ వెండర్ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్‌లో ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ నెలకొల్పారు. ఇందుకోసం లక్షల్లో నిధులు ఖర్చు చేశారు. మెప్మా మహిళలు నిర్వహించిన క్యాంటీన్‌కి ఆదరణ కరువై ఆదిలోనే హంసపాదు పడ్డట్లు అయింది. ప్రధాన రహదారిపై క్యాంటీన్ ఉన్నప్పటికీ జనం ఎవరూ రాక నిర్వాహకులు నష్టపోయినట్టు తెలిసింది.
ఒక నెలరోజులు కూడా క్యాంటీన్ సక్రమంగా నడవలేదన్న అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆ ప్రాంతంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నడవదని మెప్మా మహిళలు ముందే మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు వారి మాటను బేఖాతరు చేశారు. అధికారుల నిర్ణయాలతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ సరిగ్గా నడవడం లేదని పక్కన ఉన్న వీధి వ్యాపారులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
పది సంవత్సరాల క్రితం నుంచి చిరు వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాలను రోడ్డున పడేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పునరుద్ధరించడానికి అధికారులు కష్టాలు పడుతున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు బాగా నడుస్తున్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న మున్సిపల్ అధికారులకు క్యాంటీన్ బంద్ కావడంతో గందరగోళంలో పడ్డారు. క్యాంటీన్ తిరిగి తెరిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. అధికారులు లక్షలు పెట్టి ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నాలుగు కాలాలపాటు నడవకపోవడంతో మెప్మా మహిళలు సైతం ఆలోచనలో పడ్డారు. మరోసారి మహిళా క్యాంటీన్ పునరుద్ధరించాలని అధికారులు మెప్మా మహిళలకు చెప్పినప్పటికీ వారు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ గురించి వివరాలను కోరగా, కమిషనర్ సరస్వతి స్పందించలేదు. మెప్మా అధికారి శంకర్ మాత్రం మార్చిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం క్యాంటీన్ సరిగా నడవడం లేదన్నారు.