బంజారాహిల్స్, జూలై 23: నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి సరైన చికిత్సను అందించేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో ప్రముఖ స్లీప్ థెరపిస్ట్ డాక్టర్ హర్షిణీ ఎర్రబెల్లి ఏర్పాటు చేసిన ‘స్లీప్ థెరప్యూటిక్స్, ది బ్రీత్ క్లినిక్’లను మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథో డ్, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సరైన విధంగా నిద్రపట్టకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని, ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలామంది తీవ్రంగా ఆందోళన చెందుతుంటారన్నారు. నిద్రలేమితో అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటే ముందుగా నిద్రలేమి సమస్యను గుర్తించి సరైన చికిత్సను అందించాల్సి ఉంటుందన్నారు.
నిద్రలేమి సమస్యలను గుర్తించడంతో పాటు అవసరమైన చికిత్సలను అందించేందుకు తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా ప్రత్యేకమైన ఆస్పత్రిని ప్రారంభించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డా. హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్లకు పైగా జనాభా నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, గురక, నిద్రలో నడవడం, కలత నిద్ర లాంటి అనేక రకాలైన ఇబ్బందులతో నిద్రలేమి ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. స్లీప్ అప్నియాగా పిలిచే ఈ సమస్యలను గుర్తించడంతో పాటు చికిత్సను అందించేందుకు తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.