బన్సీలాల్‌పేట్ ( హైదరాబాద్ ) : ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani) సూచించారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్, డి-క్లాస్, అరుణ్‌జ్యోతి కాలనీలలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ( Government ) ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్కారును నిలదీద్దామని అన్నారు.
ఖాళీ స్థలాల్లో పోకిరీలు మద్యం సేవించి, స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అక్కడ కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలోనే నిధులను మంజూరు చేశానని, పనులను మొదలుపెట్టడానికి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను కోరారు. అరుణ్‌జ్యోతి కాలనీ మార్గంలో రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను (GHMC Officials) ఆదేశించారు.
డిసెంబర్ నెలలో ఫించన్ రాలేదని పలువురు మహిళలు తలసానికి వివరించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి, జీహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్, విద్యుత్‌శాఖ డీఈ శ్రీధర్, జలమండలి డీజీఎం శశాంక్ తదితరులు పాల్గొన్నారు.