దుండిగల్, మే 29 : వినూత్న వ్యాపార భావనలే లక్ష్యంగా అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన బాబ్సన్ కాలేజ్ నిర్వహించిన వార్షిక పోటీలలో నగర శివారు, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లి మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు అదుర్స్ అనిపించారు. ఈ పోటీలలో ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ది బాబ్సన్ కోలాబరేటివ్ గ్లోబల్ స్టూడెంట్ చాలెంజ్-2024లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలలోని 25 పాఠశాలల నుంచి 2,414 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ యాజులు మేడూరి మాట్లాడుతూ ఈ అవార్డులు తమ విద్యార్థుల ప్రతిభ, అంకితభావం, వినూత్న ఆలోచనలకు నిదర్శనమన్నారు. మహీంద్రా విశ్వవిద్యాలయంలో సృజనాత్మకత, సమస్య పరిష్కారాన్ని ప్రోత్సహించే వ్యవస్థాపక వాతావరణాన్ని పెంపొందించడానికి అంకితభావంతో ఉన్నామన్నారు. అనంతరం మహీంద్రా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ (సీఈఐ) ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ రాజ్‌కుమార్ ఫటాటే మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని తమ యూనివర్సిటీ విద్యార్థులు కలిగి ఉన్నారని తెలిపారు.
హార్వెస్టెడ్ రోబోటిక్స్ అనేది అధునాతన లేజర్లు, రోబోటిక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా రైతులకు రసాయన రహిత కలుపు నిర్వహణ పరిష్కారాన్ని అందించి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. యూనివర్సిటీకి చెందిన రాహుల్ ఆరెపాక, ప్రణవ్ మొగ్లీ, సాయిఫణి, సంజయ్ ప్రమోద్, అతిన్ సకీర్ల బృందం రెండో స్థానాన్ని సంపాదించింది.
ఎక్స్ట్రైవ్ ఇన్నోవేషన్స్ అనేది వర్కర్ సౌలభ్యం, ఉత్పాదకతను మెరుగుపరుస్తూ కార్యాలయంలో భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు రూపొందించబడిన ఎర్గోనామిక్, ఖర్చుతో కూడుకున్న ఎక్సోస్కెలిటన్‌ను అభివృద్ధి చేసింది. ఇది వృత్తిపరమైన ఆరోగ్యం, ఎర్గోనామిక్స్లోని క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంది. పారిశ్రామిక పని వాతావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. యూనివర్సిటీకి చెందిన అభిషేక్ ప్రతాప్, రోనక్ ఓనం, ప్రేమ్ నింగోంబమ్, యశస్వి మాట్ల బృందం మూడో స్థానాన్ని సంపాదించింది.