సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగర వీధులు సరికొత్త అందాలకు నిలయంగా మారుతున్నాయి. ఆధునికతతో పాటు ఆకట్టుకునే ఆకృతులు కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఏక శిలతో జింక రూపంలో శిలలను రూపొందించి వీధుల్లో ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ ముగిసే చోట పీవీఎన్ఆర్ మార్గంలో ఏర్పాటు చేశారు. ఏక శిలతో రూపొందించిన జింకల శిల్పాలు ఎంతో ఆకట్టుకునేలా హరి ప్రసాద్ అతని బృందం తీర్చిదిద్దిందని పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ చుట్టూ ఉన్న 158 కి.మీ పొడవున్నా ఔటర్ రింగు రోడ్డు వెంట వినూత్న రూపాల్లో తీర్చిదిద్దిన శిల్పాలు ఏర్పాటు చేస్తూ నగరానికి కొత్తందాలను తీసుకువస్తున్నారు. ల్యాండ్ స్కేపింగ్ వివిధ ఆకృత్తుల్లోని చిత్రాలు సైతం రోడ్డు మీద వెళ్లే వారిని ఒక్కసారి ఆలోచించేలా చేస్తున్నాయి. ఒకవైపు పచ్చిక బయళ్లతో పాటు ఆకట్టుకునే శిల్ప కళా చిత్రాలను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలోని కోర్ సిటీతో పాటు ఔటర్ రింగు రోడ్డు ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.