హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ముందున్న సర్ అలెక్ స్టీమ్ ఇంజిన్ ఇప్పుడు హైదరాబాదీలను అబ్బురపరుస్తున్నది. మీరు సికింద్రాబాద్ నుంచి మెట్టుగూడ వైపు వెళ్తున్నట్లయితే రైల్ నిలయం ముందు ఐకానిక్ సర్ అలెక్ స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్ కనిపిస్తుంది. ఈ లోకోమోటివ్ ఆవిరి ఇంజిన్ ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నప్పటికీ ఇప్పుడు అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆ స్టీమ్ ఇంజిన్ అదనపు హంగులతో అందంగా ప్రకాశించడాన్ని మీరు గమనించవచ్చు.
వారసత్వ సంపద అయిన ఈ ఆవిరి ఇంజిన్‌ను సంరక్షించే ప్రయత్నంలో దక్షిణ మధ్య రైల్వే దానికి ఆదనపు హంగులు అద్దింది. మళ్లీ కొత్తగా పెయింట్ వేసింది. అంతేగాక ఆ ఇంజిన్‌కు కొన్ని నూతన ఫీచర్లను కూడా జోడించింది. ఈ వారసత్వ ఇంజిన్ ఇప్పుడు నిజంగా రన్నింగ్‌లో ఉన్నట్లే శబ్దం చేస్తుంది. మధ్యమధ్యలో హారన్ల శబ్దం వినిపిస్తుంది. అంతేగాక అప్పటి ఆవిరి ఇంజిన్ మాదిరిగానే పొగను కూడా వదులుతుంది. ఈ కొత్త ఎఫెక్ట్స్ ఇప్పుడు హైదరాబాదీలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఈ ప్రకాశవంతమైన సర్ అలెక్ స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్‌కు సంబంధించిన వీడియోను దక్షిణ మధ్య రైల్వే సోషల్ మీడియాలో షేర్ చేసింది. కింది వీడియోలో కొత్త హంగులద్దుకున్న ఆ వారసత్వ సంపదను మీరు కూడా వీక్షించవచ్చు.