మేడ్చల్, డిసెంబర్ 1 : కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో అనారోగ్య పరిస్థితులు దాపురించాయని బీఆర్ఎస్ నేత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బీఆర్ఎస్వీ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ నేతలు మూడుచింతపల్లి మండలం జగన్‌గూడలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రంలోని పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 1000 గురుకుల పాఠశాలలను స్థాపించి, నాణ్యమైన విద్యను అందించారని తెలిపారు.
కాంగ్రెస్ ఆ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితులు ఉంటే, కాంగ్రెస్ హయాంలో విద్యార్థులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితులు వచ్చాయన్నారు. విష పూరిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థతకు గురవుతున్నారని, కొంత మంది విద్యార్థులు చనిపోతున్నారన్నారు. మూడుచింతపల్లి మండలంలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలో కూడా అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మూడుచింతపల్లి, శామీర్‌పేట మండలాల మండల ప్రధాన కార్యదర్శులు అనిల్ రెడ్డి, పవన్ ముదిరాజ్, నాయకులు మహేశ్ నాయక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.