నగరంలో అక్రమ ఆయుధాల దందా ఆందోళన కల్గిస్తుంది. బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఆయుధ తయారీ ముఠాలు సిటీని వ్యాపారానికి వేదికగా మార్చుకుంటున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ, బొల్లారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రెండు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక డబుల్ బ్యారెల్ తపంచా, 19 లైవ్ రౌండ్లతో పర్బన్స్కుమార్ పట్టుబడిన విషయం తెలిసిందే. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు బీహార్‌లో తక్కువ ధరకు తుపాకులు కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు ప్లాన్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
ఉత్తర భారతదేశం నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిలో కొందరు వ్యసనాలకు బానిసలై, అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడి పరిస్థితులు నేర ప్రవృత్తి కల్గిన వ్యక్తులను గమనిస్తూ నగరంలో దేశీ తుపాకులకు గిరాకీ ఉందని గుర్తిస్తూ ఆ దందాలోకి ఆకర్షితులవుతున్నారు. నేరగాళ్లతో పరిచయాలు పెంచుకోవడం గంజాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రౌడీషీటర్లను ఎంచుకొని అక్రమాయుధాలను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ చెక్‌పోస్టులు, రవాణా మార్గాల్లో సరైన నిఘా లేకపోవడంతో అనేక ముఠాలు యథేచ్ఛగా ఆయుధాలను నగరంలోకి చేరవేస్తున్నారు. చర్లపల్లిలో నివాసముంటున్న పర్బన్స్కుమార్ బీహార్‌కు వెళ్లి సోను అనే వ్యాపారి వద్ద 3 తుపాకులు, 19 బుల్లెట్లు తెచ్చి నగర శివారులో అమ్మకానికి ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్ నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల ద్వారా రహస్యంగా పిస్టళ్లను తెచ్చి పాతబస్తీ, సైబరాబాద్ పరిధిలో రియల్టర్లకు విక్రయిస్తున్న ముఠాను గతంలో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ మల్వా ప్రాంతానికి చెందిన ఆయుధ తయారీదారుల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి తెచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నరేండ్లలో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 15 ముఠాలకు పైగా పోలీసులు పట్టుకొని, 45 మంది వరకు అరెస్ట్ చేసి, 35 వరకు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ ఆయుధాల విక్రయాలకు అడ్డుకుంటామని, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్‌లో ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఇవన్నీ మాటలకే పరిమితమని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్యారియర్లు, ఏజెంట్లను అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ఇంటెలిజెన్స్ నిఘాను మరింత పటిష్టంమ చేయకపోతే నగరంలోకి అక్రమంగా తుపాకులు ఇంకా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.