కుత్బుల్లాపూర్, మే11 : హర్యానా రాష్ట్రం గురుగావ్ నుంచి తక్కువ ధరకు మద్యాన్ని దిగుమతి చేసుకొని రాష్ట్రంలో ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్ముతున్న ముఠాను మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. రూ.40 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొని, ఏడుగురుని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కె.విజయభాస్కర్ గురువారం తన కార్యాలయంలో కేసు వివరాలు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.మాధవయ్య నేతృత్వంలో సీఐ సహదేవ్, కుత్బుల్లాపూర్ సీఐ యాదయ్య టీమ్‌లుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు.
బాచుపల్లి చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో హర్యానాకు చెందిన రెడ్‌లేబుల్ బాటిల్స్ దొరికాయి. కారులో ప్రయాణిస్తున్న ఎల్లం కిషన్‌రెడ్డి, నేపాల్రెడ్డి, ఒంటేరు రాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఐడీఏ బొల్లారంలో గోడౌన్ నుంచి విదేశీ మద్యాన్ని సరఫరా చేస్తారని తెలుసుకుని గోడౌన్‌పై దాడి చేశారు. అక్కడ మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. అలాగే అదేరోజు గౌడౌన్‌లోకి మద్యం డంపింగ్ చేసే వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఇందులో సుమారు రూ.40 లక్షల మద్యం బాటిళ్లతో పాటు వాహనాన్ని, సెల్ఫోన్లను సీజ్ చేశారు. కాగా హర్యానా గురుగావ్ సెక్టార్-2లో డిస్కవరీ లిక్కర్ హౌజ్ నుంచి మద్యం దిగుమతి జరుగుతుందని గుర్తించారు. వైన్‌షాప్ యజమానితో పాటు ఏడుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.