దుండిగల్, జూన్ 15: కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు సోమవారం గాజుల రామారంలోని సర్వేనంబర్ 219,79 సరిహద్దు ప్రాంతంలో చేపట్టిన బీఆర్ఎస్ నేత ఫిరోజ్‌ఖాన్ ఇంటి ప్రహరీ కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆర్ఐ కలీం, ఇతర సిబ్బందితో కలిసి జేసీబీతో స్థలం చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రహీంఖాన్ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం రెవెన్యూ పరిధి, నెహ్రూనగర్‌లో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ఖాన్కు సుమారు 150 గజాల స్థలం ఉంది. అయితే ఈ స్థలంపై వివాదం గత కొంత కాలంగా నడుస్తున్నది.
సర్వేనంబర్ 79 ప్రభుత్వభూమిలోకి వస్తుందని ఓ బీజేపీ నాయకుడు సోషల్‌మీడియాలో తరచూ పోస్టులు పెట్టడం, దాని ఆధారంగా రెవెన్యూ అధికారులు ఫిరాజ్ఖాన్ వద్దకు వచ్చి కూల్చివేస్తామని హెచ్చరించడం పరిపాటిగా మారింది. అయితే సదరు ఇంటి స్థలం సర్వేనంబర్ 219 ప్రైవేట్ భూమిలోకి వస్తుందని, ఇందుకు అన్ని ఆధారాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు రెవెన్యూ అధికారులకు చూపించినట్లు ఫిరోజ్‌ఖాన్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈనేపధ్యంలో ఈనెల12న మధ్యాహ్నం కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ కలీం, జీపీవో విజయ్‌తో కలిసి ఫిరోజ్‌ఖాన్ ఆధీనంలో ఉన్న ఇంటిస్థలం వద్దకు విచారణకు వెళ్లగా ఫిరోజ్‌ఖాన్ అధికారుల చర్యలను నిరసిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విధితమే. దీంతో అధికారులు అదేరోజు ఫిరోజ్‌ఖాన్‌పై జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో సోమవారం పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలకు వెళ్లగా, మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తననే టార్గెట్ చేసుకుని ఎందుకు వేధిస్తున్నారంటూ కూల్చివేతలను ఫిరోజ్‌ఖాన్‌తోపాటు అతని కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన స్థలం చుట్టూ ఉన్న ప్రహరీని జేసీబీతో కూల్చివేస్తుండటం చూసి తట్టుకోలేని ఫిరోజ్‌ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అధికారులు, కుటుంబసభ్యులు అతన్ని చికిత్స కోసం ఓ వైద్యశాలకు తరలించారు. ఇదే విషయమై ఆర్ఐ కలీం మాట్లాడుతూ ఇంటిచుట్టూ ఉన్న ప్రహరీని పోలీసు బందోబస్తు మధ్య సోమవారం కూల్చివేశామని, సర్వే నిర్వహించిన అనంతరం ఫిరోజ్‌ఖాన్ నిర్మించిన గది ప్రభుత్వస్థలంలోకి వస్తే మళ్లీ కూల్చివేతలు చేపడుతామని స్పష్టం చేశారు.