దుండిగల్, సెప్టెంబర్10: కత్వాచెరువు ఆక్రమణల విషయంలో సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనేది దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మూడురోజుల క్రితం హైడ్రా అధికారులు గండిమైసమ్మ-దుండిగల్ మండలం, మల్లంపేట్‌లోని కత్వా(పెద్ద) చెరువు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన 13 విల్లాలను నేలమట్టం చేసిన విషయం విధితమే.
అయితే ఈ విషయంలో విల్లాల కొనుగోలు దారులే బలికావాలా..? లక్ష్మీశ్రీనివాస కన్స్ట్రక్షన్స్ బిల్డర్ గుర్రం విజయలక్ష్మిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు..? ఇందులో విల్లాల విక్రేతలు..కొనుగోలు దారులు మాత్రమే బాధ్యులా..? నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు, దానికి వంతపాడిన వారు, చెరువు ఎఫ్టీఎల్,బఫర్ జోన్లో విల్లాలు నిర్మిస్తుంటే కండ్లు మూసుకున్న ఇరిగేషన్ అధికారులు బాధ్యులవుతారా..? ఇంత విధ్వంసం జరుగుతుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు..? అనే చర్చ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతుంది.
నెలరోజుల క్రితం బాచుపల్లి మండల పరిధి, సర్వేనంబర్ 134లోని ఎర్రకుంటను ఆక్రమించి నిర్మించిన మూడు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన హైడ్రా చెరువు విధ్వంసానికి కారకులయ్యారనే ఉద్దేశంతో బాచుపల్లి తహసీల్దార్ పూల్సింగ్తో పాటు నాటి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావుపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
బాచుపల్లి ఎర్రకుంట మాదిరిగానే మల్లంపేట్ కత్వా(పెద్ద) చెరువులో చోటుచేసుకున్న ఆక్రమణలు,అందుకు కారకులైన అధికారులపైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కత్వాచెరువులో మొత్తం 360 విల్లాలు ఉండగా 60విల్లాలకు మాత్రమే హెచ్ఎండీఏ నుంచి నిర్మాణ సంస్థ అనుమతులు పొందింది. మిగిలిన 300 విల్లాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి ఒక్కొక్క విల్లాకు వేర్వేరుగా అనుమతులు పొందినట్లు తెలుస్తుంది.
అయితే వీటిలోనూ కొన్ని ఫేక్ అనుమతులు ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకొని వివిధ విభాగాలకు చెందిన అధికారులను మేనేజ్చేసిన విజయలక్ష్మి ఇక్కడ పెద్ద సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసిందని స్థానికులు అంటున్నారు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు అంటున్నారు.