జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : సూపర్‌సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ( BRS MLA Gopinath ) ఆరోపించారు. శనివారం శ్రీకృష్ణానగర్ లేబర్ అడ్డా వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో యూసుఫ్‌గూడ, షేక్‌పేట్ డివిజన్లకు చెందిన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి (Kalyan Lakshmi) , షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తుందని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ (Shadi Mubarak) కింద లబ్దిదారులకు తులం బంగారం అందజేత విషయం గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని అన్నారు. మహిళలకు రూ.2500 భృతి, రూ.500 లకే వంటగ్యాస్, రూ.4 వేలు పెన్షన్లు (Pensions) ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీల మేరకు కొత్త ఏడాది నుంచైనా 6 గ్యారెంటీలు అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, బీఆర్ఎస్ యూసుఫ్‌గూడ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, నాయకులు బస్వరాజు, శరత్, బాబి, అజర్, గణేష్, కైసర్ జహాన్, గీతా గౌడ్, తదిదరులు పాల్గొన్నారు.