చార్మినార్, ఫిబ్రవరి 6 : నివాసిత ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థానికంగా కాలుష్యకారకంగా పరిసర ప్రాంతాలు మారిపోతున్నాయి. ప్రజారోగ్యాన్ని పట్టించుకోలేని అధికారులు పైగా కొత్త పరిశ్రమలు నెలకొంటున్నా .. ఔను నిర్మాణాలు సాగుతున్నాయ్ సార్.. ఏం చేద్దాం … చూస్తాంలే.. అంటూ నిమ్మకు నీరెత్తినట్లు తమ ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా స్థానికులు ఆనారోగ్యానికి గురవుతున్నారు.
క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రజారోగ్య సమస్యలపై అధికారుల తీరును స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఫలక్నుమా సర్కిల్ గాంధీనగర్ ప్రాంతంలో మిని పారిశ్రామిక వాడ వృద్ది చెందుతుంది. జనవాసాల మధ్య పరిశ్రమలు తమ కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలను ప్రభుత్వాలు నెలకొల్పుతుంటాయి. కాని ఇక్కడ మాత్రం అలాంటి నిబంధనలేవి చెల్లవంటూ అక్రమ పద్దతుల ద్వారా షెడ్లను ఏర్పాటు చేసి పరిశ్రమల నిర్వాహకులకు నెలవారి అద్దెల ప్రతిపాదికన వాటిని అందిస్తున్నారు. అక్కడ రసాయన ద్రవ్యాలతో ఉత్పత్తి జరుగుతున్న వాటితో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపిస్తున్నాయి. దుర్గంధపూరిత వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నివాసిత ప్రాంతాల్లో పరిశ్రమలేంటని స్థానికులు ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో వెళ్లండంటూ పరిశ్రమల నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.