హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (RBVRR-TGPA), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) మధ్య ఉన్న అవగాహన ఒప్పందాన్ని (MoU) మరో ఐదు సంవత్సరాలపాటు పొడిగించారు. ఈ భాగస్వామ్యం ద్వారా పోలీస్ విభాగం సైబర్ నేరాలను ఎదుర్కొనే సామర్థ్యాలను మరింత బలోపేతం కానుంది.
అకాడమీలోని 60మంది పోలీసు అధికారులకు ఆరు నెలల రెసిడెన్షియల్ సైబర్ కమాండో కోర్సు నిర్వహించనున్నారు. ఈ శిక్షణతో పోలీసులు అధునాతన నైపుణ్యాలను అలవర్చుకుని, పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కోగలరు. గృహ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఐఐఐటి-హెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ కె. శుక్లా, సైబర్ మంథన్ సెంటర్ అధిపతి ప్రొఫెసర్ రోహిత్ నేగి పాల్గొన్నారు. అకాడమీ తరఫున డైరెక్టర్ అభిలాష బిష్ట్ , ఐపిఎస్, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్ రావు హాజరయ్యారు.
అవగాహన ఒప్పందం సమావేశంలో ఐఐటీహెచ్, టీజీపీఏ అధికారులు
ఐఐఐటి-హెచ్ సైబర్ మంథన్ సెంటర్ సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలలో తన నైపుణ్యాన్ని అందించనుందని, ఈ శిక్షణా మాడ్యూల్ మరింత సమృద్ధిగా మారనుందని అధికారులు తెలిపారు. సైబర్ సామర్థ్య నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.