సిటీబ్యూరో, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాలలోని వరదలు నగరాలకు ప్రాణ సంకటంగా మారుతున్న తీరు వర్ణనాతీతం. ప్రకృతి ప్రకోపానికి పరిష్కారంగా ఐఐటీ హైదరాబాద్ వినూత్న టెక్నాలజీని డెవలప్ చేసింది. జియో మెట్రోలాజికల్ సమాచారాన్ని ఆధునాతన ఏఐ టెక్నాలజీ ద్వారా విశ్లేషించి, నగరంలో కురిసే వర్షం తీవ్రత, నీటి ప్రవాహం, వరద ముప్పు వంటి అంశాలను పక్కాగా అంచనా వేసే అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సతీశ్ కుమార్ రేగొండ పరిశోధనా బృందం అభివృద్ధి చేసింది.
దీని ద్వారా హైదరాబాద్ లాంటి నగరంలో ముంచెత్తుకు వచ్చే వరదలను గుర్తించే టెక్నాలజీ రూపొందించింది. మెటరాలజీ, హైడ్రాలజీతో పాటు బల్దియా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ పూర్తి స్థాయి ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో నమోదయ్యే వర్షపాతం, వరద ప్రవాహం, ఇతర వర్షపాత నమోదు విధానాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నగరవాసులను సులభంగా అప్రమత్తం చేసేందుకు యూఎఫ్ఐఎస్ విధానం తోడ్పడుతుందని పరిశోధనా బృందం పేర్కొంది.
రేగొండ బృందం అధ్యయనం
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డా.సతీష్ కుమార్ రేగొండ పరిశోధన బృందం కొంత కాలంగా అర్బన్ ఫ్లడింగ్పై అధ్యయనం చేస్తోంది. నగరాన్ని ముంచెత్తే కుండపోత వానలను ముందుగానే గుర్తించే వీలుండగా, వీటన్నింటిని ఒకే వేదిక ద్వారా విశ్లేషించి వరద తీవ్రత, నమోదయ్యే వర్షపాతాన్ని పక్కాగా అంచనా వేసేందుకు అర్బన్ ఫ్లడింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు.
బహుముఖ విశ్లేషణ
రెయిన్ ఫాల్ రన్ ఆఫ్ అనాలిసిస్ మోడలింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ టూల్స్ ద్వారా వర్షపాతాన్ని పలు విధాలుగా ముందస్తుగానే గుర్తించే వీలుంది. బృందానికి చెందిన స్కాలర్ మహ్మద్ అజారుద్దీన్ ైక్లెమెటాలజికల్ అంశాలపై పరిశోధిస్తుండగా, ప్లడ్ అనుబంధ ఆప్లికేషన్ల రూపకల్పన చేయడంపై స్కాలర్ పద్మిని దృష్టి సారించి పరిశోధనలు చేస్తున్నారు. ఫ్లడ్ సమాచారంపై ప్రాచుర్యం కలిగించేందుకు సోషల్ మీడియా వేదికగా అలర్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. వర్షాన్ని, వరదలను ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. అధునాతన టెక్నాలజీ సాయంతో పనిచేసే యూఎఫ్ఐఎస్ ద్వారా రెయిన్ ఫోర్కాస్టింగ్ (అంచనా) ఖచ్చితత్వంతో చేయడానికి అవకాశం ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం చెబుతోంది.