సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వినియోగంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఐఐసీటీలో జరుగుతున్న వన్ వీక్ వన్ ల్యాబ్ కార్యక్రమంలో భాగంగా గురువారం కిసాన్ మేళా నిర్వహించారు. రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు మేళాను సందర్శించి ఐఐసీటీ అభివృద్ధి చేసిన సాంకేతికతను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రైతులతో కలిసి పనిచేసేందుకు ఐఐసీటీ సిద్ధంగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో డెవలప్ చేసిన బయోమాన్యూర్, బయోగ్యాస్, ఫెరిమోన్స్, వాటర్ ప్యూరిఫికేషన్ వంటి ఉత్పత్తులను కిసాన్ మేళాలో ప్రదర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిరిపురం గ్రామంలో నూలు పోగులకు అద్దే రంగులతో వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రూపొందించిన ఈటీపీ టెక్నాలజీ గురించి వివరించారు. ఈ విధానంతో నూలు డైయింగ్‌తో వచ్చే నీటి వ్యర్థాలతో 7వేల మందికి లబ్ధి చేకూరుతుందని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… సన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ సాగు విధానాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ గంగాగ్ని రావు మాట్లాడుతూ… అనారోబిక్ గ్యాస్ రియాక్టర్ టెక్నాలజీ ద్వారా వ్యర్థాలను బయోగ్యాస్ ఇంధనంగా మారుస్తున్నామన్నారు. నిత్యం 10 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్లాంట్‌ను బోయిన్పల్లి మార్కెట్లో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. దీని నుంచి 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రతినిధి డా. డీ. రాజిరెడ్డి, హైదరాబాద్ వర్సిటీ మాజీ వీసీ డా. పొదిలి అప్పారావు, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కాగా మూడ్రోజుల్లో 1200మంది సందర్శించగా, మార్చి 12వరకు ఈ ప్రదర్శన ఉంటుందని ఐఐసీటీ వర్గాలు తెలిపాయి.