గత పదేండ్లలో కేవలం 8శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు
దేశంలో వెనకబడిన 93 శాతం మంది గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్
రానున్న పదేండ్లలో 16వేల మిలియన్ల ఇంజినీర్స్ అవసరం
‘బైట్ ఎక్స్ఎల్’ అధ్యయనంలో వెల్లడి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ఐటీ కోర్సులు చేసినా.. 93 శాతం మంది ఉద్యోగాలు పొందడంలో వెనకబడి పోతున్నారని, అందుకు సరైన నైపుణ్యం లేకపోవడమే కారణమని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘బైట్ ఎక్స్ఎల్’ అధ్యయనంలో వెల్లడైంది. రానున్న పదేండ్లలో 16 మిలియన్ల ఇంజినీర్స్ ఐటీ రంగ పరిశ్రమకు అవసరం ఉన్నందున ఇప్పటికైనా గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ స్కిల్స్ పెంచుకోవాల్సిందేనని తేలింది. టైర్ 1 నగరాల్లోని విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తే, టైర్ 3 పట్టణాలకు చెందిన విద్యార్థులు తక్షణమే ఐటీ కెరీర్ ప్లేస్మెంట్స్ కోసం వెళ్తున్నారు. ముఖ్యంగా 2022లో ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలైన పుల్ స్టాక్, డెవ్ యాప్స్ ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ భాషలపై ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది.
60 విద్యా సంస్థలు.. 55 వేల మంది విద్యార్థులు
ఐటీ పరిశ్రమలో ఉద్యోగ ధోరణులు, ఐటీ రంగంలో ప్రస్తుత నైపుణ్య అంతరాలు, వాటిని అధిగమించే తీరు వంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులు, యూనివర్సిటీలు, కార్పొరేట్స్ సంస్థలతో కలిసి సమగ్రమైన ఇంటర్వ్యూలు చేశారు. 60 విద్యా సంస్థలకు చెందిన 55 వేల మంది విద్యార్థులను కలువగా.. ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి.
అధ్యయనం గుర్తించిన కీలక అంశాలు
గత పదేండ్లలో (2012-2022) ఐటీ రంగంలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్లో కేవలం 8శాతం మంది మాత్రమే ఐటీ ఉద్యోగాలు పొందారు.
ప్రసుత్తం దేశంలోని 93శాతం గ్రాడ్యుయేటింగ్ ఇంజినీర్స్ ఐటీ నైపుణ్యానికి సంబంధించిన అంశంలో వెనకబడి ఉన్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు వారికి ఐటీలో సరైన నైపుణ్యం లేదు.
వచ్చే 5 ఏండ్లలో ఐటీ రంగం 300 బిలియన్ల డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందుతుంది.
రానున్న 10 ఏండ్ల కాలంలో 2032 నాటికి 16 మిలియన్ల ఇంజినీర్స్ ఐటీ రంగ పరిశ్రమకు అవసరం ఉంటుంది.
దేశంలోని టెక్నికల్ గ్రాడ్యుయేటింగ్ ఇంజినీర్స్లో కేవలం 4.7 శాతం మంది మాత్రమే కోడింగ్ చేయగలుగుతున్నారు.
దాదాపు 93శాతం మంది గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు ఐటీ కంపెనీల్లో కెరీర్ పొందేందుకు అవసరమైన ఐటీ నైపుణ్యాలను కలిగి లేరు.
ఐటీ రంగంలో ప్రతి 4-5 ఏండ్లకొకసారి పునఃనైపుణ్యాలను సంతరించుకోవడం తప్పనిసరి.
సీ, జావా, ఫైథాన్ వంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్ను టైర్ -1, టైర్ -2 నగరాల విద్యార్థులు ప్రాధాన్యతనిస్తుంటే, టైర్-1 నగరాల్లోని విద్యార్థులు డేటా సెక్యూరిటీస్ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
టైర్ 2 నగరాల్లో మహిళా విద్యార్థుల ప్రదర్శన పరంగా గణనీయమైన అభివృద్ధి కనిపించింది.
ఈ అధ్యయనం ద్వారా డిజిటల్ విద్యపై ఆధారపడటం, విద్యావేత్తల నడుమ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో నైపుణ్యం పూర్తి స్థాయిలో లేదని వెల్లడైంది.
ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆయా ప్రోగ్రామింగ్ అంశాల్లో శిక్షణనిచ్చేందుకు సరైన కరిక్యులమ్ అందుబాటులో ఉండటం లేదు.
ఈ కారణంగానే విద్యార్థులు ప్రత్యేకమైన వేదికల కోసం వెతుకున్నారని, దీని కోసం 2022లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలైనటువంటి పుల్ స్టాక్, డెవ్ ఆప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, యూఐ, యూఎక్స్, ఐఓటీ, ఏఐ, ఎంఎల్, సైబర్ సైక్యూరిటీతో పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలైన ఫైథాన్ వంటి వాటి పట్ల విద్యార్థులు అమితాసక్తిని కనబరుస్తున్నారు.
అదనపు సర్టిఫికెట్ కోర్సులైన ఏడబ్ల్యుఎస్, ఎంఎస్ అజూర్ వంటి వాటి పట్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.