
మియాపూర్, డిసెంబర్ 20 : సింహభాగం ప్రజలు ఆధార పడ్డ వ్యవసాయ రంగాన్ని నానాటికీ బలోపేతం చేస్తూ సాగునీరు, విద్యుత్, ఎరువులు, రైతు బంధుతో ఆర్థిక తోడ్పాటు సహా ఇతర ఎన్నో వసతులతో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా మారుస్తుంటే పండిన ధాన్యాన్ని కొనబోమని తెగేసి చెబుతూ కేంద్రం రైతులను నిలువునా ఎండబెడుతున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు సాగుకు దూరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు చేయబోమన్న కేంద్రం మంత్రి పియూష్ గోయల్ ప్రకటనకు నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ నేతృత్వంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తొలుత ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాముళ్లపూడి కమాన్ వద్ద కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాస్‌రావ్ సహా పార్టీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలు నల్లచొక్కాలు ధరించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ చౌరస్తాలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, జగదీశ్ గౌడ్ సహా పార్టీ నేతలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు సహా ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్, మియాపూర్ డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కేంద్రం బాధ్యత మరిచింది..
స్వరాష్ట్రం ఏర్పడ్డ అనతి కాలంలోనే తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా ఉందని, ఎన్నో పథకాలతో రైతులకు ప్రభుత్వం సాగుపై పూర్తి భరోసాగా నిలిచిందని విప్, ఎమ్మెల్యే గాంధీ అన్నారు. తెలంగాణలో పండిన ధాన్యంపై కేంద్రం సవతి తల్లి ప్రేమను కనబరిచి కొనుగోళ్లు చేయకుండా కొర్రీలు పెట్టిందన్నారు. ధాన్యం సేకరణను కేంద్రం సాఫీగా చేపట్టే వరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆందోళన కొనసాగిస్తామని విప్ గాంధీ స్ఫష్టం చేశారు. కేంద్రమే ఈ బాధ్యతలనుంచి తప్పించుకుంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నదని ఇది ఏమాత్రం సబబు కాదని ఆయన హితవు పలికారు. రైతులను మోసం చేసే కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పటం తథ్యమని విప్ గాంధీ పేర్కొన్నారు.