Cantonment | బొల్లారం, జూలై 8 : కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోతే బోర్డు కార్యాలయంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇండ్లను ముట్టడిస్తామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కంటోన్మెంట్ ఆరో వార్డులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… గత పది సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానికంగా నెలకొన్న సమస్యలు ఎక్కడికక్కడే తిష్ట వేస్తున్నాయని తెలిపారు. 2022లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టే చేసి విత్ డ్రా గడువు ఇచ్చిన తరువాత కూడా ఎందుకు ఎలక్షన్ రద్దు చేశారనీ ప్రశ్నించారు.
భారత దేశంలోనీ 62 కంటోన్మెంట్ లలో బోర్డు నామినేటెడ్ సభ్యులతో పాలన చేయడం సరికాదన్నారు. ఈ విషయమై పలు మార్లు రక్షణ శాఖ మంత్రి, అధికారులతో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. రక్షణ శాఖ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండి పడ్డారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ఎన్నికలను నిలుపుదల చేయడమేమిటి అని ప్రశ్నించారు. చట్టము ఎవరి చుట్టము కాదని గుర్తు చేశారు. బోర్డు పరిపాలన విభాగంలో ముగ్గురు మాత్రమే పాలించటం ఎంతవరకు సమంజసమని అడిగారు.
బోర్డు ఎన్నికల విషయమై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోతుందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం చేసేటీవన్ని చీకటి చట్టాలు, చీకటి ఒప్పందాలనేనని మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. కంటోన్మెంట్ ప్రజలు భారతదేశ పౌరులు కాదా! అని ప్రశ్నించారు. మీడియా సాక్షిగా చేతులు జోడించి అడుగుతున్న కంటోన్మెంట్ ప్రజల సౌలభ్యం నిమిత్తం ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ అధికారులను కోరారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రంపై ఒత్తిడి చేసి ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.