కేపీహెచ్బీ కాలనీ, జూలై 7 : వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కాలం చెల్లిన భవనాలలో నివసించడం, వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముండడంతో ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించారు. భారీ వర్షాలకు కూలిపోయే స్థితిలో ఉన్న శిథిలావస్థ భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను నిర్వహించారు. గతేడాది గుర్తించిన శిథిలావస్థ భవనాలలో కూల్చివేసినవి, మరమ్మతులు చేసినవి కాకుండా మిగిలిన ఉన్న భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను వెంటనే సీజ్ చేయాలని, మరమ్మతులకు అవకాశమున్న భవనాల యజమానులకు నోటీసులు జారీచేసే ప్రక్రియపై దృష్టినిసారించారు.
ఐదు సర్కిళ్లలో.. 93 శిథిలావస్థ భవనాలు..
గతేడాది కూకట్పల్లి జోనల్ పరిధిలో 93 శిథిలావస్థ భవనాలున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మూసాపేట సర్కిల్లో 9, కూకట్పల్లి సర్కిల్లో 15, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 12, గాజురామారం సర్కిల్లో 4, అల్వాల్ సర్కిల్లో 53 శిథిలావస్థ భవనాలున్నట్లు తేల్చారు. ఈ భవనాలలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 12 భవనాలను కూల్చివేయగా.. 23 భవనాలకు మరమ్మతులు చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. 41 భవనాలను ఖాళీ చేయించగా మిగిలిన 16 భవనాలకు నోటీసులు జారీ చేశారు. సకాలంలో స్పందింని భవనాలపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ యేడాది మరోసారి శిథిలావస్థ భవనాలను గుర్తించేందుకు సర్వేను ప్రారంభించారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయనున్నారు. చట్టరీత్యా స్పందించకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ప్రమాద నివారణకు ముందస్తు చర్యలు..
శిథిలావస్థ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. సర్కిల్ అధికారులతో సమావేశాలు నిర్వహించి సర్కిళ్ల వారీగా శిథిలావస్థ భవనాలను గుర్తించడం జరుగుతుంది. గతంలో గుర్తించిన శిథిలావస్థ భవనాల్లో కొన్నింటిని కూల్చివేయగా మరికొన్నింటిని సీజ్ చేయడం జరిగింది. ఈ ఏడాది అత్యంత ప్రమాదకరంగా ఉన్నవాటిని కూల్చివేసేలా కసరత్తు చేస్తున్నాం. శిథిలావస్థ భవనాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నాం. శిథిలావస్థ భవనాల్లో నివసించడం ప్రమాదకరమని యజమానులు తెలుసుకుని జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్