సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ) : ఆధునిక సాగు విధానాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. ఓ వైపు సాగు పరిశోధనలు మరోవైపు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను వెతికేందుకు అధునాతన సాంకేతికతను ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగానే అగ్రిటెక్ స్టార్టప్‌లు నెలకొల్పుతూ.. వినూత్న ఆవిష్కరణలను రూపొందిస్తున్న ఇక్రిశాట్‌కు స్టేట్ బ్యాంక్ ఇండియా ఫౌండేషన్ సహకారం అందించనున్నది.
ఈ క్రమంలో స్టార్టప్ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టులకు సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా నిధులు సమకూర్చనున్నది. వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నది. ఎస్బీఐ ఫౌండేషన్ బృందం తాజాగా ఇక్రిశాట్ను సందర్శించి పరిశోధనలపై చర్చించింది. క్యాంపస్‌ను సందర్శించిన ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ సంజయ్ ప్రకాశ్ ఇక్రిశాట్లోని స్టార్టప్ నిర్వాహకులను అభినందించారు.