నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మరో మూడు రోజులపాటు ఐబొమ్మ రవిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఇంచార్జీ కోర్టు మెజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి శనివారం సాయంత్రం 5వరకు విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఇటీవలే 5రోజులపాటు పోటీసు కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేసిందని, మరోసారి పోలీసు కస్టడీకి అప్పగించరాదని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించినప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీలత వాదనలతో ఏకీభవించిన కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది.
బెట్టింగ్ యాప్‌ల ద్వారా లభించిన డబ్బును ఐబొమ్మ, బెప్పం యాప్‌లను ఉపయోగించి సినిమాలను పైరసీ చేసి కోట్ల రూపాయలు గడించాడని పీపీ వాదించారు. సుమారు రూ.500 కోట్ల వరకు ఆర్థికంగా లాభం పొందినట్టు గుర్తించి ఈడీ సైతం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జైలులోనే నిందితుడిని విచారించేందుకు ఈడీ కూడా కోర్టులో పిటీషన్ దాఖలుకు సిద్ధమైంది. తొలి విడుత పోలీసు కస్టడీలో సమాచారాన్ని అందించేందుకు రవి నోరుమెదపలేదని, సమాధారాలిచ్చేందుకు నిరాకరించినట్టు పీపీ తెలిపారు. ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడో తెలుసుకోవాల్సి ఉందని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన విధానాన్ని రాబట్టాల్సి ఉందని తెలిపారు. దీంతో న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని, థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని షరతులు విధిస్తూ ఉత్తర్వులో పేర్కొంది.
మరోకేసులో అరెస్టు
ఐబొమ్మ రవిని మొత్తం 5కేసుల్లో కేవలం ఒక్క కేసులో మాత్రమే అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా పీటీ వారెంట్ ద్వారా మరోకేసులో రవిని అరెస్టు చేసి బుధవారం సాయంత్రం కోర్టు ఎదుట హాజరుపర్చారు. అనంతరం 14రోజులపాటు రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు నిందితుడిని చంచల్గూడా జైలుకు తరలించారు. మా అధ్యక్షుడు మంచు మనోజ్, దర్శకుడు దిల్‌రాజుతోపాటు ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కు చెందిన ప్రముఖులిచ్చిన ఫిర్యాదుల మేరకు మరో మూడు కేసుల్లోనూ పీటీ వారెంట్‌కు అనుమతివ్వాలని కోరుతూ అధికారులు కోర్టు ఎదుట పిటీషన్లు సమర్పించారు. 111 సెక్షన్ (అర్గనైజ్డ్ క్రైమ్)ను అధికారులు జోడించడం చట్ట విరుద్ధమని, ఈ కేసుకు సదరు సెక్షన్ వర్తించదని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కస్టడీ ముగిసిన తర్వాత మరోకేసులో కస్టడీకి కోరుతూ పిటీషన్ దాఖలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో నిందితుడి బెయిల్ పిటీషన్ వాదనలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పట్లో నిందితుడికి బెయిల్ మంజూరయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.