బేగంపేట, మే 4: సనత్ నగర్ కాలనీలోని సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్‌నగర్ డివిజన్లోని సుందర్‌నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల నూతనంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన కమిటీ సభ్యులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులకు తలసాని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ లేనివి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకొని తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.