బేగంపేట్ : సికింద్రాబాద్ కోర్టు వద్ద జీవనోపాధి పొందుతున్న నోటరీ, టైపిస్ట్‌లు, స్టాంప్ వెండర్లకు తాను అండగా ఉంటానని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టైపిస్టులు, స్టాంప్ వెండర్లు తలసానిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
ఎన్నో ఏండ్లుగా తాము కోర్టు పరిసరాలలో జీవనోపాధి పొందుతున్నామని, ఇటీవల ట్రాఫిక్ పోలీసులు మూడు రోజుల్లోగా ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు తాము ఎక్కడికి వెళ్ళాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉపాధి కోల్పోయి, కుటుంబాలు వీధిన పడతాయని మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ప్రసాద్‌రావు, వనిత, ప్రవీణ్‌కుమార్, వినోద్, సత్యనారాయణ, మదన్ తదితరులు ఉన్నారు.