సిటీబ్యూరో, మాదాపూర్, జూన్ 30(నమస్తే తెలంగాణ): తెల్లవారుజామున ఐదుగంటలకు.. గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు వద్దకు హైడ్రా బృందాలు చేరుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలపైకి జేసీబీలు తోలాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశాయి. సామానులను తీసుకోనివ్వండంటూ గుడిసెవాసులు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు.. ఎక్కడికక్కడ పేదోళ్ల గుడిసెలను కూల్చేస్తూ అక్కడే ఉన్న షెడ్లను కూడా తొలగించారు.
ఎంత వద్దని మొత్తుకున్నా వినిపించుకోని పోలీసులు, హైడ్రా సిబ్బంది బెదిరింపుల మధ్య గుడిసె వాసులు భయపడిపోయారు. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు చేపట్టి అటు నుంచి సియెట్ కాలనీ వైపునకు రాగా అక్కడ స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమకు కోర్టు ఆర్డర్లున్నా ఇదెక్కడి అన్యాయం అంటూ నిలదీశారు.
తమపై నుంచి జేసీబీలు పోనిచ్చి ఆ తర్వాతే తమ ఇళ్లు కూలగొట్టాలంటూ రోదించారు.
సున్నం చెరువు పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ గుట్టలబేగంపేట్ సర్వే నంబర్లు 12,12ఎ,13 లో దాదాపు 15 ఎకరాలు ఉండగా అందులో 72 గుడిసెలు వేసుకొని కూలీలు నివాసముంటున్నారు. ఈ ప్రాంతం సున్నంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని హైడ్రా అధికారులు ఉదయం 5 గంటలకే సున్నం చెరువు వద్దకు జేసీబీలు, హిటాచిలతో వచ్చి పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదల గుడిసెలను ధ్వంసం చేశారు. గుడిసెవాసులు నిద్ర లేవక ముందే జేసీబీలతో వచ్చి వారిని బయటకు వెళ్లగొట్టారు. కొందరు తమ ఇళ్లను కూల్చేయొద్దంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపకుండా కట్టుబట్టలతో వారిని బయటకు పంపి సామాన్లతో సహా గుడిసెలను కూల్చివేశారు. గుడిసెలలో సామాన్లు తీసుకుంటామని వేడుకున్న కనికరం చూపలేదని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.
తమకు ఒక్క నోటీసైనా ఇవ్వకుండా, ఒక్క మాటైనా చెప్పకుండా, అందులోనే పడుకున్నా పట్టించుకోకుండా, ఆడవాళ్లు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా గుడిసెలను అమానుషంగా తొలగించడం ఎంతవరకు సమంజసం అని బాధితులు ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సియెట్ కాలనీ వద్ద హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో జేసీబీలకు అడ్డంగా పడుకుని తమ డాక్యుమెంట్స్, కోర్టు ఆర్డర్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కోర్టు చెప్పినట్లుగా నెలరోజుల్లోగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులు నిర్దారించకుండా మూడునెలలు దాటినా వాటిపై ఎలాంటి సమాధానం చెప్పకుండా కూల్చివేయడం ఎంతవరకు కరెక్టని వారు ప్రశ్నించారు. ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉండగా కోర్టు స్టే ఇచ్చినా ఎలా కూల్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం పరిసర ప్రాంతాల్లో హైడ్రా అధికారులు బౌండరీ ఏర్పాటు చేసేందుకు కాలువను తవ్వుతుండగా బాధితులు విలపిస్తూ జేసీబీకి అడ్డుపడ్డారు. హైడ్రా డౌన్ డౌన్.. ! రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. జేసీబీకి అడ్డుపడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
శేరిలింగంపల్లి మండలంలోని గుట్టలబేగంపేట సర్వేనంబర్ 12,13లో 23 ఎకరాల లే ఔట్లో 236 మంది ప్లాట్ ఓనర్లు ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్ ఓనర్లు తమ ప్లాట్లు చట్టబద్ధమైనవని, 2021లో ప్రభుత్వమే గ్రీన్టిబ్యునల్కు సున్నంచెరువు పరిధి 15 ఎకరాలని ఇచ్చినట్లు చెప్పారు. 1990లో లోకాయుక్త చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు కుటుంబ సభ్యురాలు జయప్రద దేవితో పాటు మరో ముగ్గురి వద్ద 21.32 ఎకరాలు కొనుగోలు చేసి సియట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వద్ద అనుమతులు తీసుకొని యూఎల్సీలు, ఎల్ఆర్ఎస్ లు, ప్రాపర్టీ టాక్స్ లను చెల్లిస్తున్నామంటూ ఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు వాపోయారు.
అసలు తమ ఇల్లు కట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అన్ని పర్మిషన్లతో తాము ఇల్లు కట్టుకుంటే హైడ్రా వచ్చి కూల్చేస్తుంటే తాము ఎవరిని కలవాలని, చట్టపరంగా తమకు న్యాయం చేయాల్సిన వారే చట్ట విరుద్దంగా వ్యవహరిస్తే ఎవరికి తమ గోడు చెప్పుకోవాలంటూ రాధాదేవి అనే మహిళ ప్రశ్నించారు.
1956 నుంచి ఈ భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తమ దగ్గరున్నాయని, హైడ్రా ఆఫీస్‌కు వెళ్తే మీ ఇళ్ల జోలికి రామని చెప్పి ఇప్పుడేమో ఇలా చేస్తున్నారని బాధితులు వాపోయారు. తాము కబ్జాదారులం కాదని, రిటైర్డ్ ఉద్యోగులమని, ఒకవేళ తాము కబ్జా చేసినట్లు నిరూపిస్తే తాము ఉరిశిక్షకైనా రెడీగా ఉన్నామని వారు తెలిపారు. తాము అన్ని టాక్స్‌లు కడుతున్నామని, ఇప్పటికీ తమకు హౌస్ టాక్స్ కట్టాలంటూ మున్సిపాలిటీ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని, అంతేకాకుండా ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఇళ్లు ఎలా కూలగొడ్తారని ప్రశ్నించారు.
తమకు న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగడం లేదని సియెట్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విజిలెన్స్ కమిషన్ చెప్పిన విధంగా రీ సర్వే చేయకుండా ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించారు. సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించడమే లక్ష్యంగా ఎఫ్టీ ఎల్, బఫర్ జోన్ లని ఎటువంటి నిర్ధారణ చేయకుండానే సున్నం చెరువు చుట్టూ బండారి వేసేందుకు జేసీబీలతో కాలువలను తవ్వారు. దీంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లని ఏ విధంగా నిర్ధారణ చేశారని, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నివాసాలను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు
ఇదిలా ఉంటే సున్నం చెరువు వద్ద నీరు కలుషితమైందంటూ హైడ్రా అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పరీక్షలు చేయించింది. మూడురోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఒక రిపోర్ట్‌ను విడుదల చేసిన హైడ్రా సున్నంచెరువు పరిసరప్రాంతాల్లోని నీరు కలుషితమైందని, ఈ నీటిని తాగవద్దంటూ హైడ్రా హెచ్చరించింది. ఇక్కడ నీటిదందా చేస్తే కేసులు పెడతామంటూ వెంకటేశ్ అనే వ్యక్తిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అతడికి సంబంధించిన నీటి ట్యాంకర్లను సీజ్ చేయడంతోపాటు అక్కడున్న బోర్లను, షెడ్లను తొలగించారు.
మరొకొంతమందిపై కూడా కేసులు పెడతామని హైడ్రా అధికారులు చెప్పారు. అయితే హైడ్రా గత సెప్టెంబర్‌లో సున్నం చెరువులో కూల్చివేతలు చేపట్టినప్పుడే వెంకటేశ్ హైడ్రాపై కోర్టుకు వెళ్లారు. అప్పట్లో అది సంచలనమైంది. ఆ తర్వాత ప్రతిసారి తమ పనులకు అడ్డుతగులుతున్నాడంటూ వెంకటేశ్‌ను పలుమార్లు హైడ్రా అధికారులతో పాటు వేర్వేరు శాఖల అధికారులు బెదిరించినట్లు వెంకటేశ్ కుటుంబ సభ్యులు చెప్పారు. ముఖ్యంగా హైడ్రాపై కోర్టుకు వెళ్లి తమ ఇల్లు కూల్చేయవద్దని స్టే తెచ్చినందుకే నీటి వ్యాపారం అంటూ అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారంటూ వారు వాపోయారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని వెంకటేశ్ కుటుంబసభ్యులు తెలిపారు.
మా చెల్లి అనారోగ్యంతో దవాఖానలో ఉండగా చూసేందుకు వెళ్లా. నేను దవాఖాన నుంచి తిరిగి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాకయ్యాను. మా స్థలంలో ఏర్పాటు చేసుకున్న గుడిసె కానరాకుండా పోయింది. గుడిసెలో ఉన్న సామాన్లు సైతం పనికిరాకుండా అయ్యాయి. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి.. మా బాధను చూసి ప్రభుత్వం మాకు ఏదైనా దారి చూపించాలి.
– తిరుపతమ్మ, బాధితురాలు
ఉదయం ఆరు గంటల సమయంలో చెప్పా పెట్టకుండానే జేసీబీలతో వచ్చి గుడిసెలో ఎవరైనా ఉన్నారా లేరా అని కూడా చూడకుండా కూల్చివేశారు. మాపై కర్రలు మీద పడటంతో ఉలిక్కిపడి లేచి ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యాం. బయటకు సామాన్లు తీసుకుంటాం కొద్దిసేపు సమయం ఇవ్వమని అడిగిన కనికరించకుండా ధ్వంసం చేశారు. ప్రభుత్వం మమ్ముల్ని ఆదుకోవాలి.
– లక్ష్మమ్మ, బాధితురాలు