సిటీబ్యూరో/బేగంపేట : హైదరాబాద్‌లో వానాకాలం నేపథ్యంలో హైడ్రా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. నగరంలోని నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రసూల్‌పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్నీ సెంటర్ వద్ద వాణిజ్య నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. నాలాల కబ్జాపై హైడ్రా అత్యంత పటిష్టంగా వ్యవహరిస్తుందని, అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చేస్తామని కమిషనర్రంగనాథ్ స్పష్టం చేశారు. పేదల నివాసాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల ఆధారంగా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనల్లో హస్మత్‌పేట, పికెట్ నాలాలను నిశితంగా పరిశీలించారు. ప్యాట్నీ వద్ద 17 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా దాదాపు 150 మీటర్ల పొడవునా కేవలం ఆరు నుంచి ఏడు మీటర్లకే కుంచించుకుపోయిందని గుర్తించారు.
దీనివల్ల మహేంద్రహిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయ్, విమాన్‌నగర్ వంటి ప్రాంతాలు ప్రతి వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు తెలిపారు. చీకోటి గార్డెన్స్, ప్రకాశ్‌నగర్ మెట్రోస్టేషన్ వద్ద కూడా ఇదే విధమైన పరిస్థితి ఉందంటూ స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో 6 మీటర్ల వెడల్పు ఉన్న వరద కాలువ కొన్నిచోట్ల 4.5 మీటర్ల మేర ఆక్రమణకు గురైందన, మరికొన్నిచోట్ల నాలాను ఇష్టానుసారం మళ్లించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్యాట్నీ వద్ద 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన నాలా ఆక్రమణల కారణంగా 15 నుంచి 18 అడుగులకు తగ్గిపోయిన చోట హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం ఉదయమే భారీ క్రేన్లు, బుల్డోజర్ల సహాయంతో బేగంపేట ప్యాట్నీ నాలాను ఆక్రమించి ఉన్న రెండు పురాతన భవనాలను కూల్చివేశారు.
వర్షం కురుస్తున్న ప్రతిసారి బేగంపేట రహదారి షాపర్ స్టాప్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద భారీగా వర్షం నీరు నిలుస్తుంది. ఈ విషయమై హైడ్రా అధికారులు, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ అధికారులు దృష్టి సారించారు. వర్షం నీరు ఎందుకు ముందుకు పోవడం లేదు..రహదారిపై ఎందుకు నిలుస్తుం.. అనే అంశాలను పరిశీలించి ఈ క్రమంలో ప్రకాశ్ నగర్లో ప్రవహిస్తున్న నాలా పరీవాహక ప్రాంతాలను క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గతంలో ఆరు మీటర్ల వరకు ఉన్న నాలా ఎలా కుంచించుకు పోయింది. నాలాపై నిర్మించిన భారీ భవనాలు ఆక్రమణలను పరిశీలించి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సికింద్రాబాద్ జోనల్, బేగంపేట సర్కిల్ అధికారులను ఆదేశించారు.
నాలాల ఆక్రమణల తొలగించే దిశగా నాలుగునెలల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నగరంలోని నాలాల ఆక్రమణలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి ఆ ఆక్రమణలను తొలగిస్తామని, ఈ ప్రక్రియ వర్షాకాలం మొత్తం కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా నగరంలో వరద నీరు తరచూ నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తామని ఆయన పేర్కొన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కూల్చివేస్తామని, పేదలు నివాసముంటున్న గృహాల విషయంలో ప్రభుత్వం ఎలా చెబితే అలా ముందుకుసాగుతామని చెప్పారు. ఇప్పటివరకు నగరంలో 30వేల నాలాల ఆక్రమణలు గుర్తించినట్లు హైడ్రా అధికారి ఒకరు తెలిపారు. ఇందులో కమర్షియల్‌గా ఉన్నవాటిని ఈ నాలుగునెలల్లో వరుసగా కూల్చేస్తామని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పూర్తి ట్రాఫిక్ కంట్రోల్లో ఉండేలా చూస్తూ ఈ నాలాల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపడుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో నాలాల ఆక్రమణలను ఇరవై నాలుగేళ్ల కిందటే గుర్తించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కిర్లొస్కర్ కమిటీ సిటీలో నాలాలపై ఆక్రమణలు ఎన్ని.. వాటి స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 14వేల నాలాల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించింది. ఆక్రమణల తొలగింపు, పునరావాసానికి రూ.700కోట్ల నిధులు అవసరమని అంచనావేసింది. కాలక్రమేణా అంచనావ్యయం మారిందే తప్ప ఆక్రమణలకు అడ్డుకట్ట పడలేదు.
అంతేకాదు.. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నాలాల ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ నగరం ముంపు ముప్పుతో ఉన్నదని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) ద్వారా నాలాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఎక్కడా ఒక్క ఆక్రమణ కూడా తొలగించకుండా రెండు దశల్లో సిటీలోని నాలాలు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలే తప్ప అభివృద్ధి వైపు దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరంలో ఎక్కడైతే వరద ముప్పు అధికంగా ఉందో వాటిని గుర్తించి అక్కడ అభివృద్ధ్ది పనులు చేపట్టారు.