HYDRAA | సిటీబ్యూరో: బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయం మరో ప్రాంతానికి మారనున్నది. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను హైడ్రాకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ నెలాఖరులోగా కార్యాలయాన్ని మార్చడానికి హైడ్రా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న హైడ్రాను ఇప్పుడు బేగంపేటకు మారుస్తుండడం, ఓఆర్ఆర్ లోపల చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా కార్యాలయం కూడా చెరువు హద్దుల్లోనే ఉందని మరి దీన్ని ఎలా చూడాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో ప్రభుత్వం హైడ్రాను మరోచోటికి మార్చడానికి నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హైడ్రా కార్యాలయానికి ప్రతిరోజూ 30 నుంచి 40 ఫిర్యాదులొస్తున్నాయని సమాచారం. వీటిని పరిశీలించడమే పెద్ద పని కాగా.. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం మరింత తలనొప్పిగా ఉంటుందని అధికారులు అంటున్నారు.