సిటీబ్యూరో, మే 12(నమస్తే తెలంగాణ): హైడ్రా గొప్పగా చెప్పుకుంటున్న బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో బతుకమ్మకుంట యధాతథస్థితిలోనే ఉండాలని, తదుపరి విచారణ వరకు ఎలాంటి పనులు చేయవద్దంటూ ఇరు పార్టీలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా ఈ తీర్పుతో నీరుగారిపోయింది. జూన్ 10వరకు స్టేటస్కో ఉండడంతో హైడ్రా చేపట్టిన వ్యర్థాల తొలగింపు పనులను ఆపేశారు. ఇప్పటివరకు మూడుసార్లు ఈ పనులు వాయిదాపడ్డాయి.
కోర్టుల్లో కేసులు..
అంబర్‌పేట మండలం బాగ్అంబర్పేటలోని సర్వే నంబర్ 563లో 1962-63 లెక్కల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉంది. బఫర్‌జోన్‌తో కలిపి 16.13 ఎకరాలు ఉంది. ప్రస్తుతం బతుకమ్మ కుంట విస్తీర్ణం 5.13 ఎకరాలు. ప్రస్తుతం ఈ స్థలం విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ స్థలం తనదేనంటూ సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాలను ఆశ్రయించారు. అంతకుముందు సయ్యద్ ఆజాం అనే వ్యక్తి వద్ద 1986లో 7 ఎకరాల భూమికి ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకున్నారు.
కానీ కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదని తెలిసింది. తర్వాత ఆ భూమి ప్రభుత్వానిదంటూ అధికారులు చెప్పారు. దీంతో 1999లో సయ్యద్ ఆజాం హైకోర్టును ఆశ్రయించారు. కానీ కేసును సివిల్‌కోర్టులో తేల్చుకోవాలంటూ హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత సయ్యద్ ఆజాం కేసులో సుధాకర్‌రెడ్డి చేరారు. 2020లో కేసు కొట్టేశారు. తిరిగి సుధాకర్‌రెడ్డి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించిన ఇంజక్షన్ అప్లికేషన్ 22.4.2025 రోజున సిటీసివిల్కోర్టు సుధాకర్‌రెడ్డి వాదనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
సీఎం నోట బతుకమ్మకుంట..
ఈనెల 8న హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మకుంటపై మాట్లాడారు. స్థానిక కాంగ్రెస్ నేత వీహెచ్ 25 ఏండ్లుగా ఈ కుంట గురించి పోరాటం చేస్తున్నారని, హైడ్రా కుంటను స్వాధీనం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు. ఈ ఏడాది బతుకమ్మకుంటలోనే స్థానిక మహిళలు బతుకమ్మ ఆడుతారంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. సీఎం మాట్లాడిన మరుసటి రోజే హైకోర్టు బతుకమ్మ కుంటను యధాతథ స్థితిలో ఉంచాలంటూ స్టేటస్కో ఇచ్చింది.
హైడ్రా, హెచ్ఎండీఏలతో పాటు ప్రైవేటు వ్యక్తులు అంటే ఇరు పార్టీలు జూన్ 10 వరకు ఎలాంటి పనులు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ హైడ్రా కొనసాగిస్తున్న పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మకుంట పనులను పర్యవేక్షిస్తారని, ఆయన వచ్చేనాటికి చెరువు పూడికతీత పనులు పూర్తికావాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇంతలోనే మళ్లీ బతుకమ్మకుంట పనులకు బ్రేక్ పడడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.