‘మా ఇల్లు కూలగొట్టేటప్పుడు వద్దంటే వద్దని కాళ్లా వేళ్లా పడ్డాం.. మాకు దిక్కే లేదని మొత్తుకున్నం.. కడుపుగట్టుకుని కట్టుకున్నామన్నం.. అయినా వినలేదు.. ఇప్పుడేమో చెరువుల దగ్గర ఇండ్లను కూల్చేదే లేదని చెబుతున్నరు. కూలగొట్టకపోవడం మంచిదే.. కానీ మా ఇండ్లు కూలగొట్టిండ్రు కదా.. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటరు.
సీఎం తీసుకుంటడా.. రంగనాథ్ సారా.. ఎవరు తీసుకుంటరు. మా ఇల్లు కూలగొట్టేదాకా పట్టుబట్టిండ్రు. ఇప్పుడేమో మా దిక్కే చూడకపోతిరి.. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రి బాగుపడతడా’.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన తిరుపతమ్మ అనే మహిళ .‘అప్పుడేమో మా ఇండ్లన్నీ అక్రమమని కూల్చేశారు.. పిల్లలతో సహా రోడ్డున పడ్డం.
మూడు నెలల నుంచి మా బతుకులు పూర్తిగా దెబ్బతిన్నయ్.. ఇప్పుడేమో ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఎక్కడ ఇండ్లు ఉన్నా మేం కూల్చేదే లేదంటున్నారు.. మంచిగనే చెబుతున్నరు. మరి మా మీద ఎందుకంత కోపం.. మేమేం పాపం చేశాం.. మా ఇండ్లు కూలగొట్టేంత తప్పు పని మేమేం చేసినం. ఇప్పుడు మా నష్టాన్ని ఎవరు భరిస్తారు.. గిదేం తరీఖ’.. అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నగేశ్ అనే బాధితుడు.
సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ ఆఫీసులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లను కూల్చేదే లేదంటూ ప్రకటించారు. ఇది ఎంతో మంది పేదవారు, మధ్యతరగతి వారికి సాంత్వన చేకూర్చే అంశమే. అయితే ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే తాము ఈ విధంగా నష్టపోకపోయేవాళ్లం కాదు కదా.. అంటూ హైడ్రా కూల్చివేతల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిర్ణయం తీసుకునేటప్పుడే ఇవన్నీ ఆలోచించుకోరా.. ఇన్నిరోజులు ఒకతీరు.. ఇప్పుడొక తీరా.. మా నష్టాన్ని ఎవరు భరిస్తారు అంటూ నిలదీస్తున్నారు.
తాము ఎంత బతిమలాడినా పట్టించుకోకుండా కట్టుబట్టలతో బయటకు వెళ్లగొట్టి మరీ ఇండ్లను నేలమట్టం చేసిన హైడ్రాకు అప్పుడు తమ బాధలు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడేమో ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్న నివాసాలను కూల్చేయమంటూ ప్రకటిస్తున్నారు. ఇది బాగానే ఉంది కానీ ఈ నిర్ణయమేదో ముందే తీసుకుంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అంటూ.. ఆవేదనతో మాట్లాడారు. మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మేము ఎంతగా నష్టపోయామో మీకు తెలియడం లేదా అని ప్రభుత్వాన్ని, హైడ్రాను ప్రశ్నిస్తున్నారు.
Hydra Demolitions 1
హైడ్రా ఇప్పటివరకు సుమారుగా 300 వరకు నిర్మాణాలను కూల్చేసింది. ఆగస్టు, సెప్టెంబర్లోనే 262 నిర్మాణాలు కూల్చివేసింది. అమీన్పూర్ చెరువులోనే 24 నిర్మాణాలు కూల్చివేయగా, సున్నం చెరువులో 42 నిర్మాణాలు, కత్వా చెరువులో13 విల్లాలు కూల్చేసింది. అమీన్పూర్, సున్నం చెరువులలో ఎక్కువగా నష్టపోయింది పేదవారే. తమ కుటుంబాలతో సహా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి జీవనం గడుపుతూ ఇండ్లు నిర్మించుకున్న పేదలు, మధ్య తరగతి వారికి హైడ్రా రాత్రికిరాత్రే షాకిచ్చింది.
ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఉన్నవారిని ఉన్నట్లుగానే కట్టుబట్టలతో బయటకు పంపి బుల్డోజర్లతో వారి ఇండ్లను నేలమట్టం చేసింది. ఇప్పటికీ హైడ్రా చేసిన విధ్వంసపు ఆనవాళ్లు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అయితే కూల్చివేతల తర్వాత వచ్చిన అధికారులు కూడా తమను అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ భయపెట్టినవారే తప్ప తమ గోడు వినే పరిస్థితే లేదని వారు చెప్పుకున్నారు.
తమ ఇండ్లు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్నాయంటూ కూల్చేసిన హైడ్రా ఇప్పుడేమో ఆ రెండింటిలో ఉన్న ఇండ్లను కూల్చేయమని చెప్పడంతో తాము షాకవుతున్నామని చెబుతున్నారు. ఈ నిర్ణయం కూల్చివేతలకంటే ముందే తీసుకుంటే తాము ఇంతగా నష్టపోయేవారం కాదు కదా అని బాధపడుతున్నారు. ఇండ్లు కూలగొట్టి హైడ్రా వెళ్లిపోయినా అదే ప్రాంతంలో చిన్నచిన్న గుడిసెలు వేసుకుని ఉంటున్నారు బాధితులు. తమ బతుకుదెరువు ఇక్కడేనని, ఇక్కడినుంచి వెళ్లిపోతే తమకు గంజి కూడా దొరకదని బాధపడుతున్నారు.
హైడ్రా వచ్చింది.. మా ఇల్లు కూలగొట్టింది. పిల్లాపాపలతో రోడ్డున పడ్డం. ఎంత చెప్పినా ఆగకుండా పెద్దపెద్ద మిషన్లతో మొత్తం నేలమట్టం చేసిండ్రు. మేం చెరువులో కట్టుకోలేదు సారు. మా చెరువును మేం కాపాడుకుంటం అని కూడా చెప్పినం. కాగితాలు చూపిస్తమన్నా చూడకుండానే కూలగొట్టింరు. ఇప్పుడేమో చెరువులో ఉన్నోళ్ల ఇళ్లు తీసేయరంట. మా ఇల్లు కూలగొట్టడానికి ముందే ఈ నిర్నయం తీసుకుంటే బాగుండే కదా.
-స్వప్న, బాధితురాలు
మేం పదిహేనేళ్లుగా ఇక్కడనే ఉంటున్నం. మా ఇండ్లు కూల్చేయడానికి వచ్చినప్పుడు అధికారులను బతిమలాడినం. వద్దని కాళ్లు కూడా పట్టుకున్నం. కానీ వినలేదు. ఇక్కడ ఉండొద్దని చెప్పి పెద్దపెద్ద యంత్రాలతో మా ఇళ్లన్నీ కూల్చేసిండ్రు. ఎందుకని అడిగితే చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పిండ్రు. ఇప్పుడేమో హైడ్రా సార్ మాత్రం నివాసమున్న ఇళ్లను కూల్చేయమని చెప్తున్నరు. మరి మా ఇల్లు ఎందుకు కూల్చేసినట్లు. ఇదేం పద్ధతి.
– శంకర్, బాధితుడు