రామచంద్రాపురం, నవంబర్ 13 : రుద్ర సహిత శతచండీ యాగం మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల మంత్రాలతో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీ మార్మోగింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శతచండీ మహాయాగానికి శ్రీకారం చుట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా వంద మంది వేది పండితులు వచ్చి యాగాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు యాగానికి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. రుద్ర సహిత శతచండీ మహాయాగంలో భాగంగా ఆదివారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని శృంగేరీ ఆస్థాన విద్వాంసులు వి.గోపికృష్ణశర్మ, మాడుగుల పురుశోత్తమ శర్మ నేతృత్వంలో వైభవంగా జరిపారు. ఆధ్యాత్మిక ప్రవచన కర్త, శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బంగారయ్య శర్మ ధార్మిక ప్రవచనాలు చేశారు. ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, నగేశ్, యాదగిరి యాదవ్ చండీయాగానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.