శేరిలింగంపల్లి, నవంబర్ 13 : నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని ఏడీపీ సాఫ్ట్వేర్ సంస్థలో ఆదివారం నిర్వహించిన ‘బ్రింగ్ యువర్ కిడ్స్ టు వర్క్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సంస్థ ఉద్యోగులు తమ కుటుంబసభ్యులు, చిన్నారులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. దాదాపు 800 మంది సంస్థ ఉద్యోగులు, 1200 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాజిక్ షో, పెయింటింగ్, డీజే ఫెస్ట్ అంశాల్లో ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు.
నానక్‌రాంగూడలోని నూతన క్యాంపస్‌లో కొవిడ్ తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌తో పాటు పుణే నగరంలోని కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ విపుల్‌సింగ్ పేర్కొన్నారు. ఉద్యోగులు తాము పనిచేసే కార్యాలయాల్లో తమ పిల్లలను తీసుకవచ్చి వారికి తమ కార్యకలాపాల గురించి వినోదాత్మక వాతావరణంలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యమని తెలిపారు.