సిటీబ్యూరో/బండ్లగూడ, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మనిషికి అత్యంత విశ్వాసమైన జంతువు కుక. గతంలో ఇంటికి కాపలాకు మాత్రమే శునకాలను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు అది స్టేటస్ సింబల్‌గా మారింది. ప్రేమ, స్టేటస్..ఇతర కారణాలు ఏవైనా పెట్స్ మీద పెద్ద వ్యాపారమే నడుస్తోంది. దేశీయ రకాలతో పాటు ఫారెన్ డాగ్స్ కూడా మనోళ్లకు పెట్స్‌గా మారాయి. అంతేకాదు తమ పెట్ డాగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్ది వాటికి అందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
తాజాగా ఆదివారం హైదరాబాద్ నగర శివారులోని బండ్లగూడ జాగీర్‌లో ‘గో పప్పీ డాగ్ అండ్ క్యాట్ షో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ షోలో చిట్టిపొట్టి పప్పీలు తెగ ముద్దొస్తూ సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేశాయి. ఒకే చోట రకరకాల శునకాలు.. దేనికదే ప్రత్యేకం అన్నట్లుగా ఉన్నాయి. ఈ విభిన్న జాతులు శునకాలు, మార్జాలాలను కలిపి ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులతో సందడిగా మారింది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా వాటిని చూసేందుకు ఆసక్తి చూపారు.
వాటిని ఎత్తుకునేందుకు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. విభిన్న జాతుల శునకాలతో నిర్వహించిన ఈ షోను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సూర్యకళారెడ్డి, మేయర్ మహేందర్‌గౌడ్, చైర్పర్సన్ సుష్మ మహేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు సాగర్‌గౌడ్, అస్లంబిన్ అబ్దుల్లా, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, బీజేఎంసీ యువజన అధ్యక్షులు మల్లేశ్‌యాదవ్, నాయకులు నాగరాజు, పాపయ్యయాదవ్, గోపాల్, విష్ణువర్ధన్‌రెడ్డి, సయ్యద్‌ఖాజా, రజాక్ తదితరలు పాల్గొన్నారు.