సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : నగరంలోనే అతి ప్రాచీన, అరుదైన వారసత్వ గుట్టల పరిరక్షణపై జనాలు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణం గొంతు కోసినట్లుగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. చారిత్రక స్పృహ లేకుండా, వందల ఏళ్ల నాటి రాయదుర్గం, దుర్గం చెరువు పరిసరాల్లో విస్తరించిన అరుదైన గుట్టలను కనుమరుగు చేస్తున్న నేపథ్యంలో.. నగరవాసులు, పర్యావరణవేత్తలు వాటిని సందర్శించి పరిరక్షించాలంటూ వేడుకుంటున్నారు. ఓవైపు పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నా.. భూముల వేలం నిర్వహించిన ప్రభుత్వం.. రాయదుర్గం పాన్ మక్తా పరిధిలోని వారసత్వ గుట్టల మనుగడ ప్రశ్నార్థకం చేసేలా వ్యవహారిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వందల ఏళ్ల నాటి కిందటే సహజంగా ఉద్భవించిన అరుదైన రాతి నిర్మాణాలు ఇక నగరవాసులకు కనిపించకపోవచ్చు. ఇటీవల నిర్వహించిన భూ ముల వేలంలో రాయదుర్గం పరిధిలోని గుట్టలకు రికార్డు స్థాయి ధర పలికిందని సర్కారు జనాలను మభ్యపెడుతున్నా, దీంతో జరిగే పర్యావరణ విధ్వంసంపై ఆందోళన కలిగిస్తూ నే ఉంది. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారి, జనావాసాలతో సమానంగా పెరిగిన వాహనాల రద్దీతో, పీక్ అవర్స్ లో ట్రాఫిక్ నరకాన్ని ఈ ప్రాంతం తలపిస్తోంది. ఇక పర్యావరణ పరంగా ఎంతో సున్నితమైన ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని అరుదైన గుట్టలు, రాళ్లను కూడా నిర్వీర్యం చేస్తే కలిగే దుష్ప్రరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు.
రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు బలిపీఠమెక్కనున్న చారిత్రక గుట్టలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సామాజిక, పర్యావరణ, ఔత్సాహికులు ఆసక్తితో వీటిని సందర్శిస్తున్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అరుదైన రాళ్లు, ఎంతో కీలకమైన సహజ వన సంపద, అరుదైన వృక్ష జాతులు, పొదలు, ఎక్కడ కనిపించని మొక్కలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయంటున్నారు. వీటిని పరిరక్షించాలని కోరుతూ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యవేక్షిస్తూ, అరుదైన గుట్టల పరిరక్షణకు నగరవాసులు భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు.
ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రజాభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యత ఉండాలి. దురదృష్టవశాత్తు నగరంలో దానికి అవకాశమే లేకుండా పోతుంది. ముఖ్యంగా పర్యావరణహితమైన ప్రాంతాల పరిరక్షణ కోసమైతే నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. కానీ సర్కారుకు ఈ విషయంలో లోపించింది. ఈ గుట్టలో జీవవైవిధ్యం సమృద్ధిగా ఉంది. దీన్ని పరిక్షించుకోవాలి. రాళ్లు, గుట్టలు మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి ఎంతో ప్రాచీనమైన జీవప్రాణం ఇందులో నిక్షిప్తమై ఉందనే విషయాన్ని సర్కారు గ్రహించాలి.
ఇక్కడ ఉండే అరుదైన జీవావరణం పరిరక్షణ ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అవసరం. నా చేతిలో ఉన్నది సాధారణ బండరాయి మాత్రమే కాదు. ఈ ప్రాంతానికి పరిమితమైన అరుదైన రాతి, దానిపై నిండి ఉన్న వృక్ష సంపద. ఇక భవిష్యత్తులో కనుమరుగు కాకముందే వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులపై ఉంది.