Hyderabad | కాచిగూడ, మార్చి 4: కాబోయే భార్యను ఆటపట్టించబోయి ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించేందుకు ఉరివేసుకోగా.. పొరపాటున తాడు బిగుసుకుని అక్కడికక్కడే చనిపోయాడు. హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిలక్‌నగర్‌కు చెందిన గ్యార యాకయ్య కుమారుడు గ్యార ఆదర్శ్ (25) క్యాబ్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఇటీవల అతనికి ఒక అమ్మాయితో వివాహం కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలాగూ వివాహం నిశ్చయం కావడంతో ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు కాబోయే భార్యను ఆదర్శ్ ఆటపట్టించాలని అనుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైర్‌తో ఉరేసుకుంటున్నట్లుగా ఒక ఫోజు ఇచ్చి ఫొటో దిగాడు. ఆ ఫొటోను తనకు కాబోయే శ్రీమతికి పంపించాడు. అనంతరం కిందకు దిగుతున్న సమయంలో పొరపాటున ఆదర్శ్ మెడకు వైర్ బిగుసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదర్శ్ అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. మంగళవారం ఉదయం ఆదర్శ్ కుటుంబసభ్యులు వచ్చి చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ మృతితో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆదర్శ్ మరణ వార్త తెలుసుకున్న కాచిగూడ పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.