Wrong Route Driving | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్‌రూట్ కేసులు వేల సంఖ్యను చేరుకుంటున్నాయి. గత నెల మూడవ తేదీనుంచి రాంగ్‌సైడ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ వయోలేషన్ విషయంలో జాయింట్ కమిషనర్ జోయల్‌డేవిస్ నేతృత్వంలో ట్రాఫిక్ విభాగమంతా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేవలం ఒక్క నెలలోనే దాదాపుగా 60వేల రాంగ్‌సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి.
ఇక నెంబర్ ప్లేట్ వయోలేషన్కు సంబంధించి సుమారుగా పదివేల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు 2వేల రాంగ్‌సైడ్, మూడు వందల నెంబర్‌ప్లేట్ వయోలేషన్ కేసులు నమోదయ్యాయంటే సిటీలో ఎంతమంది ఉల్లంఘనులు ఉన్నారో అర్ధం చేసుకోవచ్చని, తాము పట్టుకున్న కేసుల్లో ఇప్పటివరకు జరిమానాలు విధిస్తున్నామని, తర్వాత మళ్లీ మళ్లీ పట్టుబడితే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరోవైపు మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ విషయంలోనూ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గత నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కొన్నిరోజుల పాటు రోడ్డుపక్కన నిలిచి ఉన్న వాహనాలకు సంబంధించి 303 ఫిర్యాదులందాయని, వీటిలో 268 వాహనాలను తొలగించామని, ఈ డ్రైవ్ కూడా కొనసాగుతుందని, స్థానికులు ఎవరైనా ఇలాంటి రోజుల తరబడి వాహనాలు తమ తమ ప్రాంతాల్లో చూస్తే వాటి గురించిన వివరాలు తమకు తెలియచేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.