సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ ఈ -మొబిలిటీ వీక్‌లో భాగంగా హైటెక్స్‌లో కొనసాగుతున్న ఈ మోటార్ షో రెండో రోజు కూడా ఉత్సాహంగా సాగింది. సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి విద్యుత్తు వాహనాలపై అవగాహన పొందారు. విభిన్న రకాల ఎలక్ట్రిక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి. కాగా శుక్రవారంతో ఈ ఎక్స్ పో ముగియనున్నదని నిర్వాహకులు వెల్లడించారు.
శ్రామిక వ్యక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనం
ఈ మోటార్ షోలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ-కార్లన్ స్టార్టప్‌తో శ్రామిక వ్యక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. సిలిండర్ డెలివరీ, కూరగాయలు, పాలు అమ్మే వారికి సులభతరంగా ఉండేల నాలుగు చక్రాలతో కూడిన వాహనాన్ని రూపొందించారు. గ్రేటెట్ కమ్యూనిటీలోకి వచ్చే వాహనాలు కాలుష్యాన్ని వెదజల్లుకుంటూ సామగ్రిని తీసుకొస్తాయి. అలా కాకుండా ఈ వాహనం ఎటువంటి శబ్ధం లేకుండా, కాలుష్యం రాకుండా సేవలను అందించే విధంగా శ్రేయ, రవితేజ, శ్రీనివాస్, గోపి, చరన్ కలిసి ఈ కమర్షియల్ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనంపై 84 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. 3గంటల్లో చార్జింగ్ ఫుల్ అవుతుంది.
ప్రత్యేక ఆకర్షణగా క్వాంటం ప్లాస్మా టూ వీలర్
క్వాంటం ప్లాస్మా టూ వీలర్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం మంత్రి కేటీఆర్ ఈ వాహనాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ వాహనం ధర రూ.1.10లక్షల వరకు ఉంది. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కావడం విశేషం. 3 గంటలు చార్జింగ్ పెడితే 120 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. అంతేకాదు ఈ వాహనానికి సంబంధించిన యాప్‌ను కూడా రూపొందించారు. బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది. 2.8కిలో వ్యాట్స్ బ్యాటరీ సామార్ధ్యం ఉంటుంది. ఈ వాహనం తెలుపు, గ్రే, బ్లూ, రెడ్‌లోనూ అందుబాటులో ఉందని నిర్వాహులు వెల్లడించారు. చార్జింగ్ వివరాలు.. డిస్ప్లేలో సూచిస్తుంది.
అభినందనీయం
రాబోయే రోజుల్లో ఇక మనకు విద్యుత్తు వాహనాలే వినియోగంలో ఉంటాయి. కాలుష్యకారక వాహనాలు కనిపించవు. ఇందులో భాగంగానే ఈవీ వాహనాల తయారీపై దృష్టి సారించాం. తెలంగాణ ఈవీ వృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. స్టార్టప్‌లకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం గొప్ప విషయం.
-శ్రేయ, ఫౌండర్, ఈ కార్లన్ స్టార్టప్.