Hyderabad | సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఉద్విగ్నంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకుంటూ.. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి డప్పు చప్పుళ్లు, బోనాలు, కళకారుల ప్రదర్శనలతో ట్యాంక్ పరిసరాలు హోరెత్తాయి. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 6వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డప్పుతో దరువేయగా.. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్సులతో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలతో తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు వారీ వారీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రేటర్‌లోని ముఖ్య కూడళ్లు గులాబీమయం అవ్వగా.. బైక్‌లపై బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలు, అడుగడుగున అమరుల స్మరణతో హోరెత్తించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్, కూకట్‌పల్లిలో మాదవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ, గోషామహల్లో నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి నందకిశోర్ వ్యాస్ బిలాల్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. గోషామహల్ గన్‌పార్కు వద్ద ఎమ్మెల్సీ కవిత శ్రేణులతో కలిసి అమరులకు నివాళులర్పించి అక్కడ నుంచి బైక్‌పై ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలతో ప్రధాన రహదారులన్నీ హోరెత్తాయి.
Tankbund1
Tankbund2
Tankbund3
Tankbund4
Tankbund5
Tankbund6
Tankbund7
Tankbund8
Tankbund9
Tankbund10
Tankbund11
Tankbund12